ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డులు పంపిణీ

Dec 18,2023 19:50

ప్రజాశక్తి-విజయనగరం :  ఆరోగ్యశ్రీ మెగా అవగాహనా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ నూతన స్మార్ట్‌కార్డుల పంపిణీని ప్రారంభించారు. దీనివల్ల జిల్లాలోని సుమారు 7.5లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఈ నాలుగున్నర ఏళ్లలో ఒక్క విజయనగరం జిల్లాలోనే ఆరోగ్యశ్రీ పథకం క్రింద సుమారు 2లక్షలా 49 వేల మందికి చికిత్సను అందించడానికి రూ.470కోట్లను ఖర్చు చేశారు. మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అవగాహనా కార్యక్రమం, లాంఛనంగా నియోజక వర్గానికి ఐదు గ్రామాల్లో స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జనవరి 1 నుంచి జగనన్నఆరోగ్య సురక్ష ఫేజ్‌-2 ప్రారంభమవు తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్యక్రమం అనంతరం జెడ్‌పి ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి దీపికా పాటిల్‌, ఎంఎల్‌సి డాక్టర్‌ పి.సురేష్‌బాబు, ఎంఎల్‌ఎ బడ్డుకొండ అప్పలనాయుడు ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు నూతన కార్డులను పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ యు.అప్పలరాజు, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ గౌరీశంకర్‌, డిసిఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ కెవి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️