ఆరోగ్య పరిరక్షణకే మెగా వైద్య శిబిరం : ఎస్‌పి

Mar 2,2024 21:20

ప్రజాశక్తి – కొమరాడ  : గిరిజనులకు అండగా నిలిచేందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. మండలంలోని కూనేరులో ఎంపిపి స్కూల్‌ ఆవరణలో జిల్లా పోలీసుశాఖ ఆధ్యర్యంలో తిరుమల మెడికవర్‌, కొమరాడ పిహెచ్‌సి, రెడ్‌ క్రాస్‌ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు సహాయపడుతూ, వారికి అండగా నిలిచేందుకుగాను, కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని అన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహించాలనే ఆలోచన రాగానే తిరుమల మెడికవర్‌ వైద్యులు, కొమరాడ పిహెచ్‌సి వైద్యులు సుమారు 10 మంది వైద్య బృందం, రెడ్‌ క్రాస్‌ సభ్యులు తమవంతు సహాయాన్ని, సేవలను అందించేందుకు ముందుకొచ్చారని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. మెగా వైద్య శిబిరంలో కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆప్తమాలజిస్టు, గుండెకు సంబంధించి కార్డియాలజీ, గైనకాలజిస్టు,జనరల్‌ సర్జన్‌, ఫిజీషియన్‌ వైద్యులు ఉన్నారని, వీటితో పాటు బ్లడ్‌ ప్రజర్‌, సుగర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైద్యులు రాసిన మందులను కూడా ఉచితంగా అందిస్తామని, వాటిని సక్రమంగా వాడి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, తగు జాగ్రతలు పాటించినట్లయితేనే ఈ వైద్య శిబిరం లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌ మాట్లాడుతూ మారుమూల గిరిజనులు ఆరోగ్యపరమైన ఇబ్బందులతో జీవిస్తూ తగిన వైద్యం పొందేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితుల్లేని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా కంటి హృద్రోగం, గర్భాశయ సమస్యలు, ఇతర ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికి ఆయా రంగాల్లో నిపుణులను ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొనేలా ఎస్పీ చర్యలు చేపట్టారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మెగా వైద్య శిబిరంలో సుమారు 500మంది గిరిజనులు మారుమూల గిరిజన గ్రామాల నుండి హాజరు కాగా, వారికి ఆప్తమాలజిస్టు, గైనిక్‌, జనరల్‌ సర్జన్లు వివిధ రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించి, వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను, రెడ్‌ క్రాస్‌ సభ్యులు, సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఎస్‌పి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గిరిజన వృద్దులకు, మహిళలకు చీరలు, గొడుగులు పురుషులకు టి-షర్ట్స్‌ , యువతకు వాలీబాల్‌ కిట్లు, షీల్డ్‌లను ఎస్‌పి అందజేశారు. అనంతరం ఈ వైద్య శిబిరానికి హాజరైన గిరిజనులకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో భోజన, వసతులను కల్పించారు. కార్యక్రమంలో పార్వతీపురం రూరల్‌ సిఐ కె.రవికుమార్‌, ఎస్‌ఐ దినకర్‌, కొమరాడ ఎస్‌ఐ కె.నీలకంఠం, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, తిరుమల మెడికవర్‌ వైద్యులు, కొమరాడ పిహెచ్‌సి వైద్యులు, రెడ్‌క్రాస్‌ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

➡️