ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తం

ప్రజాశక్తి – కొమరాడ : ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా హెల్త్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో ఈ మేరకు ఆయన మంగళవారం నదీ పరీవాహక ప్రాంతంలో కళ్లికోటను సందర్శించారు. ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావుతో కలిసి సిబ్బందిని అప్రమత్తం చేసి, ప్రజలకు తగు సూచనలు చేశారు. గ్రామంలో ప్రాథమికంగా అవసరమైన మందులు, పరీక్షలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాల్లో బ్లీచింగ్‌ చేయాలన్నారు. తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయాలన్నారు. వీటికి సంబంధించి పంచాయతీ సెక్రటరీ తగు కార్యాచరణ చేపడుతూ పర్యవేక్షణ చేయాలన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని, కాన్పు సమయం దగ్గరగా ఉన్న గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రిలో చేర్చాలని వైద్య సిబ్బందికి సూచించారు. సిబ్బంది సమన్వయంతో ఉండి, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్మోహనరావు అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు చేశారు. కాచి చల్లార్చిన నీటిని ప్రజలు తాగడానికి వినియోగిం చాలని, అవసరమైన నీరు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న ఆహార పదార్థాలు వినియోగించాలని, మూతలు ఉంచాలన్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. మల్లికార్జున రావు మాట్లాడుతూ ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నదీ తీరం వైపు ఎవరూ వెళ్లరాదని సూచించారు. అనంతరం డాక్టర్‌ జగన్మోహనరావు అక్కడ నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను తనిఖీ చేసి, ప్రజలకు నిర్వహించిన ఆరోగ్య తనిఖీలు, పరీక్షలు రికార్డులో పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఎం.శిరీష, ఎంఇఒ నారాయణస్వామి, సర్పంచ్‌ డి.ముర ళీకృష్ణ, పంచాయతీ సెక్రటరీ ఎన్‌.నరేష్‌, పిహెచ్‌ఎన్‌ విజయకుమారి, వైద్య, సచివాలయం సిబ్బంది,ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️