మహారాష్ట్ర తలసరి ఆదాయానికి గుజరాత్‌ గండి

Jun 28,2024 21:20 #Business

పరిశ్రమల తరలింపు ఎఫెక్ట్‌
అగ్రస్థానంలో తెలంగాణ
ముంబయి : మహారాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాల పెరుగుదలకు గుజరాత్‌ గండి కొడుతోంది. తలసరి ఆదాయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా.. మహారాష్ట్ర ఆరో స్థానానికి పడిపోయింది. వెనుకబడిపోతోంది. మహారాష్ట్ర ఎకనామిక్‌ సర్వే 2022-24 ప్రకారం.. తలసరి ఆదాయంలో రూ.3,11,649తో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత స్థానాల్లో రూ.3,04,474తో కర్ణాటక, రూ.2,96,592తో హర్యానా నిలిచాయి. తమిళనాడు రూ.2,75,583తో, గుజరాత్‌లో రూ.2,73,558గా ఉంది. మహారాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,52,389గా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌ రూ.2,19,881తో, ఉత్తరప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.83,636గానే ఉండటం విశేషం. 2014లో మహారాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,25,260 కాగా, గుజరాత్‌ది రూ.1,13,139గా ఉంది. కాగా.. 2024 నాటికి మహారాష్ట్ర ఆదాయం రూ.2,52,389గా.. గుజరాత్‌లో తలసరి రూ.2,73,558కు పెరగడం విశేషం.
”మహారాష్ట్ర కంటే గుజరాత్‌ ఎలా పుంజుకుందో ఈ సంఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పారిశ్రామిక నైపుణ్యానికి పేరు గాంచిన మహారాష్ట్ర తలసరి ఆదాయంలో ఒకప్పుడు స్థిరంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. అయితే ఇటీవలి పలు పోకడలు ఇబ్బందికరమైన క్షీణతకు కారణమయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మహారాష్ట్ర తలసరి ఆదాయంలో వెనుకబడి పోయింది.” అని ఎన్‌సిపి(ఎస్‌పి) అధికార ప్రతినిధి మహేష్‌ తపసే అన్నారు. ”ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో కీలక ప్రాజెక్టులు మహారాష్ట్ర నుండి గుజరాత్‌కు తరలించబడ్డాయి. అహ్మదాబాద్‌ గిఫ్ట్‌ నగరాన్ని ప్రత్యామ్నాయ ఆర్థిక కేంద్రంగా ప్రచారం చేస్తూ ముంబయి ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర పర్యవసానాలను చవి చూస్తుంది. అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు స్పందిస్తారు.” అని మహేష్‌ తపసే పేర్కొన్నారు. 2.5 లక్షల కోట్ల అప్పులతో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంపై భారం మోపిందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే విమర్శించారు. మహారాష్ట్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. దీంతో తలసరి ఆదాయంలో ఆరవ స్థానానికి పడిపోయిందన్నారు.

➡️