ఆరోగ్య సురక్ష అభాసుపాలు

Jan 2,2024 21:35

ప్రజాశక్తి- మెంటాడ:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఆరోగ్య సురక్ష -2 ఆభాసుపాలయ్యింది. రోగులు లేక శిబిరం వెలవెల బోయింది. జగనన్న సురక్ష 1 కార్యక్రమం మొట్టమొదట పిట్టాడలో సెప్టెంబర్‌లో లాంఛనంగా (ఫైలెట్‌ ప్రాజెక్ట్‌) ప్రారంభించారు. కలెక్టర్‌, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై ఆర్భాటం చేశారు. సురక్ష -2 కూడా మంగళవారం పిట్టాడలో ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌, ఎంపిపి స్వగ్రామం అయినా శిబిరానికి జనాలు హాజరు కాలేదు. సుమారు 12 గంటలు అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో స్థానిక వైసిపి నాయకునితో శిబిరాన్ని ప్రారంభించారు. తరువాత కొద్దిసేపటికి ఎంపిడిఒ త్రివిక్రమ రావు వచ్చారు. మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు వచ్చి వున్నపాటి కొద్దిమంది రోగులతో ఫోటోలు దిగి వెనుదిరిగారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి సచివాలయం పరిధిలో సుమారు 612 మందిని నమోదు చేశారు. వీరెవరూ శిబిరానికి రాలేదు. దీంతో సిబ్బంది వంద మందిని శిబిరానికి తీసుకు రావడానికి ఆపసోపాలు పడ్డారు. వాలంటీర్లు, వెలుగు సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి శిబిరానికి రమ్మని కోరినా జనాలు ముఖం చాటేశారు. ఆకలి కేకలు : శిబిరానికి తీసుకువచ్చిన రోగులకు కనీసం మంచినీరు సౌకర్యం కల్పించలేదు. వైద్యులకు మినహా రోగులకు, వచ్చిన ఆశాలు, సిబ్బందికి భోజనాలు లేక ఇబ్బందులు పడ్డారు.తొలి రోజు తుస్‌..!వేపాడ: మండలంలో ఆతవ గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమ జనాలు లేక వెలవెల బోయింది. ఈ వైద్య శిబిరంలో అధికారులు ఎక్కువ రోగులు తక్కువగా కనిపించారు. దీంతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ ఇంతమంది సిబ్బంది ఈ వైద్య శిబిరానికి అవసరమా సిబ్బందిని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ వివి చిన్నరామనాయుడు, వైస్‌ ఎంపిపి ఈశ్వరరావు, ఇఒపిఆర్‌డి ఉమా, సర్పంచ్‌ గొంప వేమన రామునాయుడు, వైద్యాధికారులు ఎ. ధరణి, వరలక్ష్మి, గైనకాలజిస్ట్‌, ఆర్థోపెడిక్‌ విఎన్‌ మల్లేష్‌, కంటి వైద్యులు సిహెచ్‌ మల్లేశ్వర్‌, పంచాయతీ కార్యదర్శి నానిబాబు, పాల్గొన్నారు.రోడ్డు బాగు చేయాలని ఎమ్మెల్సీకి వినతిఆతవ జంక్షన్‌ నుండి గ్రామానికి రెండు కిలోమీటర్ల పైగా ఉన్న రోడ్డు పూర్తిగా శిధిలావస్థకు చేరిందని వెంటనే రోడ్డును బాగు చేయాలని ఎమ్మెల్సీ రఘురాజును కోరుతూ గ్రామస్తులు వినతినిచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంట్రాక్టర్‌కు బిల్లులు అందక రోడ్డు నిర్మాణం మధ్యలో నిలిపేశారని దీనికి తాను ఏమీ చేయలేనని గ్రామస్తులంతా కలిసి వస్తే మంత్రి బొత్స దృష్టికి తీసుకెళదామని బదులిచ్చారు.ప్రజలు ఆరోగ్యమే ప్రధానంగా ‘ఆరోగ్య సురక్ష’ : జెడ్‌ పి చైర్మన్‌మెరకముడిదాం: ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ఈ ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గర్భాం సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిబిరాన్ని పరిశీలించి ఏఏ ముందు ఇస్తున్నారు, ఏఏ రోగాలకు తనిఖీలు చేస్తున్నారన్న విషయాలను పరిశీలించారు. 350 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌ఒ వెంకటేశ్వరరావు, రాష్ట్ర పరిశీలకులు, మండల ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, వైస్‌ ఎంపిపి కందుల పార్వతి, నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, మాజీ డిసిఎంఎస్‌ చైర్మన్‌ ఎస్‌వి రమణ రాజు, వైసిపి మండల అధ్యక్షులు కోట్ల వెంకటరావు, సత్తారు జగన్‌ మోహనరావు, బూర్లె నరేష్‌, పప్పల కృష్ణమూర్తి, గర్భాం పిహెచ్‌సి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.నెల్లిమర్ల: జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని ఎమ్మెల్సీ డాక్టర్‌ పి. వివి సూర్యనారాయణ రాజు అన్నారు. మంగళవారం రామతీర్థం గ్రామ సచివాలయంలో రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ పేదవాడు ఆరోగ్యంగా జీవనం సాగించాలని, ఆరోగ్యం ఉంటేనే ఆనందం ఉంటుందని ఆరోగ్య సురక్ష ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అధ్యక్షులు అంబళ్ల సుధారాణి, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు అంబళ్ళ శ్రీరాములు నాయుడు, ఎంపిడిఒ జి.రామారావు, ఇఒపిఆర్‌డి కె.సింహాద్రి, స్థానిక నాయకులు, సతివాడ పిహెచ్‌సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.తెర్లాం: మండల కేంద్రంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి ఉమాలక్ష్మీ, ఎంపిడిఒ ఎస్‌. రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి సత్యనారాయణ, తెర్లాం పిహెచ్‌సి సిబ్బంది పాల్గొన్నారు.కొత్తవలస: మండలంలోని ముసిరాం సచివాలయ పరిధిలో నంబారువానిపాలెం, గొల్లలపాలెంలో మంగళవారం రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపడుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, వైసిపి మండల అద్యక్షుడు ఒబ్బిన నాయుడు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, పిసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, విరోతి కొండల రావు, బలిఘట్టం ఆదిరెడ్డి అప్పన్న, ముసిరం పైడంనాయుడు, గొల్లలపాలెం సర్పంచ్‌ నీలాద్రి బాలమణి, రమణ, రామునా యుడు, దమ్ము రమణ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️