ఆర్థిక బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్‌ నిరసనలు

చింతూరులో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -చింతూరు

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.18,096 కోట్లు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం చింతూరు ఆశ్రమ బాలికల పాఠశాల నుంచి శబరి బ్రిడ్జి వరకు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. చింతూరు మెయిన్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ముందు మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పండా కిష్టయ్య మాట్లాడుతూ ఎపిజిఎల్‌ఐ లోన్‌ బకాయిలు, డిఎ, పిఆర్‌సి ఎరియర్స్‌ చెల్లించాలని, సరెండర్‌ లీవ్‌, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు కె.కాంతమ్మ, శ్రీలత, సునీత, తులసి, సుజాత, హరినాథ్‌, ప్రభాకర్‌, కన్నారావు, ముత్తయ్య, సోమరాజు, తదితరులు పాల్గొన్నారు.అడ్డతీగల : ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావలసిన పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ అడ్డతీగల తహశీల్దారు కార్యాలయం ఎదుట యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. మధ్యలో దేవి గుడి వద్ద రోడ్డుపై మోకాళ్ళపై బైఠాయించి బకాయిలు చెల్లించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి కె.కృష్ణ, జిల్లా కార్యదర్శి జి తేజరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ బి వెంకటలక్ష్మి, జిల్లా ఆడిట్‌ కమిటీ మెంబర్‌ పి.మంగరాజు, అడ్డతీగల, గంగవరం, వై.రామవరం, రాజవొమ్మంగి మండలాల యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ రాఘవులు, కే శ్రీనివాస్‌ దొర, సిహెచ్‌ రాంబాబు దొర, సిహెచ్‌ వెంకటేశ్వరరావు, డి. పైడిమల్లి, ఎన్‌ వెంకటరమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.పాడేరు: ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ జీతంలో నెల వారిగా కొంత మొత్తం ఎపిజిఎల్‌ఐ, పిఎఫ్‌ ఖాతాల్లో దాచుకున్న సొమ్మును తమ ఆర్థిక అవసరాలకు అడిగినప్పుడు వారం లేదా పది రోజుల్లో చెల్లించాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎపిజి ఎల్‌ఐ, ఫిఎఫ్‌ లోన్లు, సరెండర్‌ లీవులు, డిఎ ఎరియర్లు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యుటి ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక పక్క ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటునే సకాలంలో జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం, పనిచేసిన కాలానికి నెల చివరి రోజున జీతాలు చెల్లించకుండా ట్రెజరీ రూల్స్‌ని ప్రభుత్వమే ఉల్లంఘించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇబ్బంది పెట్టడం తగదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ నెల 24న జిల్లా స్థాయిలో ఆందోళనలు చేస్తామని జిల్లా సహా అధ్యక్షులు చీకటి నాగేశ్వరరావు వెల్లడించారు. ఈకార్యక్రమంలో జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.గంగాధర్‌, కళారావు ఎస్‌ హరిష్‌, కె.రాజారావు, జె.పద్మనాభం, ఎన్‌. కొండబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.అరకులోయ : ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మండల కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ తసిల్దార్‌ కార్యాలయం నుండి ఎన్టీఆర్‌ గార్డెన్‌ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ వైద్య సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండి వైఖరితో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లూరి జిల్లా యుటిఎఫ్‌ గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శి దేముడు, రఘునాథ్‌ డిమాండ్‌ పాల్గొన్నారు.

➡️