ఆల్‌ ద బెస్ట్‌

Mar 18,2024 00:06

గుంటూరు పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న డిఇఒ, ఇతర అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లాలో సోమవారం నుండి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మార్చి 30వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుండి 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుంది. విద్యార్థులను 8.45 నుండి 9.30 గంటల వరకూ పరీక్షా కేంద్రలోకి అనుమతిస్తారు. పరీక్ష ముగిసే సమయం విద్యార్థులు వరకూ పరీక్షా కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ ఏడాది మాస్‌ పేపర్‌ లీకేజికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు డిఇఒ పి.శైలజ తెలిపారు. ప్రశ్నాపత్రంలో ప్రతి ప్రశ్నకూ బార్‌ కోడ్‌ ఉంటుందని, కావున ఏ ప్రశ్న లీకైనా అది ఎక్కడ లీకైంది అనే విషయం బయటపడిపోతుందని ఆమె చెప్పారు. 147 పరీక్షా కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు రెగ్యులర్‌ విద్యార్థులు బాలికలు 13,046 మంది, బాలురు 14,320 మంది మొత్తం 27,366 మంది హాజరవుతున్నారు. అలాగే ప్రైవేటు విద్యార్థులు/ఒకసారి ఫెయిల్‌ అయిన విద్యార్థులు బాల బాలికలు 3925 మంది ఉన్నారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ స్థానిక పట్టాభిపురంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ను సందర్శించి పరీక్షల ఏర్పాట్లు పరిశీలించి, అధికారులకు, ప్రధానోపాధ్యాయునికి పలు సూచనలు చేశారు. పాఠశాలను సందర్శించిన వారిలో ఇన్‌ఛార్జి డిప్యూటీ డిఇఒ బలరామ్‌నాయక్‌, ఉర్దూ డిఐ ఖాసిం, పాఠశాల హెచ్‌ఎం వీరబాబు ఉన్నారు.

పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : సోమవారం నుండి 30వ తేదీ వరకూ జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 29243 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరిలో 15151 మంది బాలురు, 14092 మంది బాలికలు ఉన్నారని, పరీక్షల నిర్వహణకు 127 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు నిర్వహించకూడదని హెచ్చరించారు. పరీక్ష తేదీల్లో సెంటర్‌ సమీపంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, విద్యుత్‌ కోతలు లేకుండా విద్యుత్‌ శాఖ అధికారులతో మాటాల్డఆమని చెప్పారు. కేంద్రాల తనిఖీకి వచ్చే అధికారులు సైతం తమ ఫోన్లను గది వెలుపలే విడిచిప లోపలికి వెళ్లాలన్నారు.పరీక్షలకు హాజరయ్యే వికలాంగ అభ్యర్థులకు స్క్రైబ్స్‌గా 9వ తరగతి విద్యార్థులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ప్రశ్నాపత్రానికి క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశామని, ఒకవేళ ప్రశ్నాపత్రం లీక్‌ అయితే ఆ ప్రశ్నాపత్రం ఏ పరీక్ష కేంద్రం నుండి లీక్‌ అయ్యిందో తెలుసుకోవచ్చని తెలిపారు. పరీక్షల నిర్వహణలో 12 మంది ప్లైయింగ్‌ స్క్వాడ్‌, 80 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌, 25 మంది రూట్‌ మరియు అసిస్టెంట్‌ రూట్‌ ఆఫీసర్స్‌ను నియమించామన్నారు. డిఇఒ కార్యాలయంలో 9963192487, 6281081702 నంబర్లతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించామన్నారు. పరీక్షల సమయంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తెలిస్తే సదరు పరీక్ష కేంద్రంలోని సిఎస్‌, డిఒలు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణసోమవారం నుండి 30వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 నిమిషాల నుండి సాయంత్రం 5:30 వరకు సార్వత్రిక విద్యాపీఠం ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని, 4172 మంది హాజరయ్యే ఈ పరీక్ష నిర్వహణకూ ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు కూడా ప్లైయింగ్‌ స్క్వాడ్‌ మరియు సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించామన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే వికలాంగ విద్యార్థులకు స్క్రైబ్స్‌గా 9వ తరగతి విద్యార్థులకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇంటర్‌ పరీక్షలు రాసే వికలాంగులకు స్క్రైబ్స్‌గా 10వ తరగతి వారిని అమనుమతిస్తామన్నారు.ఫీజు నెపంతో హాల్‌ టికెట్‌ ఇవ్వకుంటే పాఠశాల గుర్తింపు రద్దుఫీజు బకాయి పేరుతో హాల్‌ టికెట్‌ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే అలాంటి స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తామని డిఇఒ హెచ్చరించారు. ఈ విషయమై తల్లిదండ్రులు తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అయితే స్కూళ్లలో ఇచ్చే వాటితో పనేలేదని, వెబ్సైట్‌ నుంచి నేరుగా హాల్‌టిక్కెట్‌ డౌన్లోడ్‌ చేసుకుని, వాటితో కేంద్రాలకు వెళ్తే పరీక్షలు రాసేందుకు అనుమతించేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. హాల్‌టికెట్‌ చూపి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు ప్రయాణించే అవకాశం కల్పించామని తెలిపారు.

➡️