సాగు శోకం

నల్లని మబ్బులు ముసురుకు వచ్చి
నింగిని చీకటి దుప్పటి కప్పేస్తే
ఆవేశంతో గంతులేయాల్సిన రైతన్న
ప్రకాశంలేని పందిట్లో కుప్పకూలాడు.

ఉరుము మెరుపు పిడుగులు చూసి
మేఘం తటాలున వరద నీరై పారే
తట్టుకోలేని నాగలి ఏడుపు ఎత్తే
తీరని వడ్డీ బాధతో పొలమూ మూల్గే.

కాయం నిండా జరజర జారి కారే
చెమట చుక్కలకు ఘర్మ ధారలకు
మద్దతుగానీ..ధర కట్టే పద్ధతిగానీ
లేనే లేదని…అమలు కానే లేదని.
మేఘం రాగం రావం చేయద
ఎద్దూ పగ్గం సాక్ష్యం చెప్పవ
కాడీ మేడీ అండగ ఉండవ
రైతుతో కలిసి కదం తొక్కవ.

రైతుల కష్టం బొక్కిన ‘మాల్‌’పతి
లక్షలు..కోట్లుగ కూడేస్తుంటే
పాలక నేతలు చేపుత ఉంటే
బసవన్నలే బుస కొడుతున్నరు.
రక్త మాంసముల రైతన్నలు
సలసల కాగే నెత్తుటి కళ్ళతొ
పెరిగిన విత్తూ సత్తువతో పోల్చి
స్వేదం..ధర ధర్మం అడుగుతూ.
వీధులకెక్కి తిరగబడ సాగితే
ఆ నేరం..ఆ నేరం ఎవ్వరదని
తొలకరి మేఘం ఉరుముతోంది.

ఆ భూమే సమ్మెకు దిగితే..!
చుక్క నీరు చిక్కుతుందా!
ఒక్క గింజ దక్కుతుందా!
అప్పుడు సోషపడి తిరగబడే
ఆకలి దప్పుకు ఆసర ఎవరు?
రాలే ప్రాణికి రక్షణ ఎవరు?
లేచిన ప్రశ్నకు బదులిచ్చేదెవరు?

– ఉన్నం వెంకటేశ్వర్లు

➡️