ఆశా వర్కర్లకు పోలీసు నోటీసులు

Feb 8,2024 00:13

తాడేపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఆశాలను కూర్చోబెట్టిన పోలీసులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా విలేకర్లు : ఆశా వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చలో విజయవాడలో పాల్గొనవద్దంటూ ఆదేశించడంతోపాటు పలువుర్ని ముందుస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నారు. గుంటూరులో యూనియన్‌ నగర అధ్యక్షురాలు కెజియాకు ఆమె నివాసంలో నోటీసు అందజేశారు. నగర ప్రధాన కార్యదర్శి హరీషాకు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు పిలిచి నోటీసులు ఇచ్చారు. నగర నాయకులు ప్రమీలకు లాలాపేట స్టేషన్‌లో నోటీసులు ఇచ్చారు. మరొక నాయకురాలు యేసుమేరికి నోటీసులు అందజేశారు. సిఐటియు గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌కు ఆయన నివాసం వద్దకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న వారిపై నిర్బంధం ప్రయోగించటానికి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, సమస్యల పరిష్కారం చూపిస్తే బాగుంటుదని అన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని నిలువరించేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. తాడేపల్లిలో సిఐటియు పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు, నాయకులు బి.వెంకటేశ్వర్లును ఎస్‌ఐ రమేష్‌ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 24 గంటలకు ముందే అరెస్టులకు పూనుకోవడం అప్రజాస్వామికమని నాయకులు ఖండించారు. తాము వేరే పనుల్లో ఉన్నా ఈ విధంగా అరెస్టులకు పూనుకోవడం సరికాదన్నారు. ఇదిలా ఉండగా స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు పోలీసులు వెళ్లి ఆశాలను దిగ్బంధించేంత పని చేశారు. చలో విజయవాడకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశాలకు వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు తమ ఎదురుగా కూర్చుని మీ విధులు మీరు చేసుకోండి.. అంటే ఎలా చేస్తామని ఆశ వర్కర్లు కె.లక్ష్మి, వి.రేణుక, కన్యాజ్యోతి, మరియకుమారి, దేవి, విజయలక్ష్మి, కరుణ వారిని ప్రశ్నించారు. మంగళగిరిలో సిఐటియు నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్చ, వై.కమలాకర్‌కు పట్టణ ఎస్‌ఐ షేక్‌ బాజీబాబు నోటీసులు అందజేశారు. చిలకలూరిపేటలో సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లుతోపాటు సుమారు 30 మందికి నోటీసులు ఇచ్చారు.

➡️