ఆస్తిపన్ను పేరు మార్పుపై ఛార్జీలు తగ్గించాలి

Dec 29,2023 21:12

ప్రజాశక్తి – సాలూరు :  మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను పేరు మార్పుపై ఒక శాతం ఛార్జీ వసూలును తగ్గించాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు మాట్లాడుతూ పట్టణంలో ఇళ్ల అమ్మకమైన తర్వాత పేరు మార్పునకు సంబంధించి వసూలు చేస్తున్న ఛార్జీలు అధికం కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన పట్టణాల్లో అరశాతం ఉంటే వెనుకబడిన పట్టణంలో ఒక శాతం వసూలు చేయడం సరైన పద్దతి కాదని చెప్పారు. దీనిపై కౌన్సిలర్లు గిరిరఘు, గొర్లి వెంకటరమణ, రాపాక మాధవరావు, బి.శ్రీనివాసరావు, ఫ్లోర్‌ లీడర్‌ గొర్లి జగన్మోహన్‌రావు మద్దతు పలికారు. గతంలో పని చేసిన కమిషనర్‌ కౌన్సిల్‌ను తప్పుతోవ పట్టించారని ఆరోపించారు. దీనికి కమిషనర్‌ జయరాం మాట్లాడుతూ ఆస్తిపన్ను పేరు మార్పునకు సంబంధించి ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయినందున ఇప్పుడు తగ్గింపు సాధ్యం కాదని చెప్పారు. కౌన్సిల్‌ తీర్మానం చేసి పంపాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఆఫీస్‌ ముందున్న ఐడిఎస్‌ఎంటి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో లీజుకు ఇచ్చిన షాపుల యజమానులు కరోనా కాలంలో వ్యాపారాలు లేనందున జీఎస్టీ, వడ్డీ మొత్తాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన అంశాన్ని వాయిదా వేశారు. 29వ వార్డులో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు గురించి పట్టించుకోవడం లేదని కౌన్సిలర్‌ గొర్లి వెంకటరమణ నిలదీశారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎఇ సూరి నాయుడు చెప్పారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ జర్జాపు దీప్తి, కౌన్సిలర్లు పప్పల లక్ష్మణరావు, సింగారపు ఈశ్వరరావు, గొల్లపల్లి వరప్రసాద్‌, జి.నాగేశ్వరరావు, నీలిమ, పి.సన్యాసమ్మ, బి.హైమసత్యవతి పాల్గొన్నారు.బడ్జెట్‌ ఆమోదం2023-24 సవరించిన బడ్జెట్‌, 2024-25 బడ్జెట్‌ అంచనాలను శుక్రవారం కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు ఆమోదించారు. ఎన్నికల నేపథ్యంలో ముందుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.4 కోట్ల 76లక్షల 87వేల 709తో సవరించిన బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. 2024-25 సంవత్సరానికి రూ.9కోట్ల 7లక్షల 62వేలతో బడ్జెట్‌ అంచనాలను ఆమోదించారు.

➡️