ఇంకా నీటిలోనే…

Dec 8,2023 23:37
నీటిలోనే

నానుతున్న వరి పనలు, ముంపులోనే చేలు
నీటమునిగిన పంలను పరిశీలించిన అధికారులు
ఆదుకోవాలని కోరుతున్న అన్నదాతలు
జిల్లాలో వరిచేలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. వరిపనలు కుళ్లిపోయే స్థితికి చేరుకున్నాయి. పలుచోట్ల ధాన్యపురాసులు తడిసి ముద్దవ్వడంతో మొలకలు వచ్చాయి. ఉన్న పంటను ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పాడైన పంటలను అధికారులు, వివిధ పార్టీల నాయకులు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ పలుచోట్ల ధర్నాలు జరిగాయి. నానుతున్న వరి పంటప్రజాశక్తి – రామచంద్రపురంమండలంలో వరి చేలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. పలుచోట్ల వర్షపు నీరు డ్రెయినేజీల్లో సరిగ్గా దిగకపోవడంతో నీరంతా చేలల్లోనే నిలిచిపోతోంది. పనలు సైతం నీటిలోనే నానుతుండంతో మొలకలు వస్తున్నాయి. శివల గ్రామంలో పంట పొలాలను ఆర్‌బికె సిబ్బంది శుక్రవారం పరిశీలించారు. వీలైనంతవరకు పనలను ఒడ్డుకు తెచ్చుకుని ఆరబెట్టుకోవాలని, పడిపోయిన వరి చేలలో వర్షం నీరు వేగంగా దిగేటట్టు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటే నష్టం మరింత పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అన్ని రకాల ధాన్యం కొనుగోలు వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణతడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని కె.గంగవరం మండలం వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ తెలిపారు. కె.గంగవరం మండలంలోని తడిసిన ధాన్యం రాసులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతం ఎగుమతులకు అవరోధంగా ఉన్న జిపిఎస్‌ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. రైతులంతా ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించుకోవచ్చని ఆయన సూచించారు. మంత్రి వేణు చొరవతో జిపిఎస్‌ విధానాన్ని నిలిపివేశారని పేర్కొన్నారు. 1,700 టన్నులు ధాన్యం ఎగుమతి మండలంలో గురు, శుక్రవారాల్లో 1700 టన్నులు ధాన్యం ఎగుమతి అయ్యిందని మండల వ్యవసాయ అధికారి బలుసు రవి తెలిపారు. జిపిఎస్‌ను నిలిపేయడంతో ధాన్యం సులువుగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు దొరికిందన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఆర్‌బికె, మిల్లుల వద్ద ఉన్న కస్టోడియల్‌ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ రెండు రోజుల్లోనూ ఎగమతులు భారీగా పెరిగాయని తెలిపారు. అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ముమ్మిడివరం : భారీ వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని ముమ్మిడివరం డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎంవి.రామారావు తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయం సమావేశపు హాల్లో శుక్రవారం మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు జగతా పద్మనాభం అధ్యక్షతన సలహా మండలి పాలక వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామారావు మాట్లాడారు. భారీ వర్షాలకు మండలంలో సుమారు 2,200 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్టు అంచనా వేశామన్నారు. ప్రతి ఎకరాకు నష్టపరిహారం రూ.6వేలు, హెక్టార్‌కు రూ.15వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. పంటల బీమా ద్వారా రుణాలను సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. మండలానికి 32 పంట కోత ప్రయోగాలు మంజురుకాగా ఇప్పటికి 22 ప్రయోగాలను వివిధ గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. పంట నష్టం 33 శాతం దాటితేనే పంటల బీమా వర్తిస్తుందన్నారు. 50 శాతం నష్టం జరిగితే పూర్తి నష్టపరిహారం వర్తిస్తుందన్నారు. వర్షాలకు పూర్తిగా తడిసిన ధాన్యంపై ఉప్పు ద్రావణం పిచికారీ చేయడం ద్వారా మొలకలు రాకుండా అరికట్టాలన్నారు. నాణ్యతకు అనుగుణంగా లేని ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు తో చర్చించి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో కర్రివానిరేవుకు చెందిన రైతు మాట్లాడుతూ 20 రోజుల క్రితం కోసినప్పటికి ఆర్‌బికె సిబ్బంది సకాలంలో సంచులు అందించలేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయింది ఆవేదన వ్యక్తం చేశారు. రైతులే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని ఆంక్షలు విధిస్తూన్నారని తెలపారు. చిట్టి రాజు మాట్లాడుతూ ఇటువంటివి పునరావృతమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని హెచ్చరించారు. లంక ప్రాంతాల్లో వేరుసెనగ, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటి నష్టం అంచనాలు పారదర్శకంగా రూపొందించి ప్రతి రైతుకు న్యాయం చేయాలన్నారు. అరటి, బొప్పాయి పంటల నష్టం అంచనాలు రూపొందించాలని వీటికి పంట నష్ట పరిహారం త్వరిత గతిన అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. పంట కాలువల్లో వెంటనే పూడిక తీత పనులు చేపట్టాలని ఇరిగేషన్‌ ఎఇ మౌనికను ఆదేశించారు. రబీలో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్‌ కమిడీ ప్రవీణ్‌ కుమార్‌, జడ్‌పిటిసి సభ్యులు కుడిపూడి శివశంకరరావు, కోలా బాబ్జి, ఆర్‌బికె, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవాలని ధర్నా
భారీ వర్షలూ వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ శుక్రవారం రైతులు మామిడికుదురు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి టిడిపి, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ముంపు బారిన పడి నష్టపోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ ధర్నాలో టిడిపి నాయకులు జె.సుబ్బారావు, ఈలి శ్రీనివాసరావు, జనసేన నాయకులు జె.శ్రీనివాసరాజు, కె.నర్సింహారావు పాల్గొన్నారు.
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
తుపానుతో రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం పలివెలలో నీట మునిగిన పంట పొలాలను, ధాన్యపు రాసులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమ నాయకుడు చంద్రబాబు రైతుల కష్టాలు విని వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రజాక్షేత్రంలో ఉండటానికి సిద్ధమయ్యారన్నారు. తుపాను కంటే ముందుగానే కొంత మేర కోతలు జరిగి పంట చేతికి వచ్చిందన్నారు. ప్రభుత్వం అసమర్థత కారణంగా, పాలనతో కనీసం ధాన్యం సంచులు కూడా రైతులకు అందివ్వలేదన్నారు. ధాన్యం పట్టుకోవడానికి సంచులు లేక సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే రైతులు పంటను కోల్పోయారన్నారు. తక్షణమే తడిసిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️