ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Feb 25,2024 23:45

ప్రజాశక్తి-గుంటూరు : వచ్చేనెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రాక్టికల్స్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక థియరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్లు, కేంద్రాల్లో సదుపాయాలు, స్క్వాడ్‌ల నియామకం ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకూ పరీక్ష ఉంటుంది. విద్యార్థులను ఉదయం 8.30 గంటలకే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షకు ఈ సారి 92 కేంద్రాలను ఎంపిక చేశారు. అయితే వాటిలో 19 పరీక్షా కేంద్రాలు కొత్తగా అనుమతిచ్చారు. అందువల్ల విద్యార్థులు ముందురోజే పరీక్షా కేంద్రాలను సందర్శించాలని అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది జిల్లాలో దాదాపు నాలుగువేల అడ్మిషన్లు పెరిగాయి. పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా కొత్త కేంద్రాలకు అనుమతిచ్చారు. అన్నిచోట్లా బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు ఇతర సదుపాయలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 30,820 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1010 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 26,573 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 1032 మంది మొత్తం 59,438 మంది హాజరుకానున్నారు. హాల్‌ టిక్కెట్లు తీసుకునే విషయంలో కొందరు విద్యార్థులకు ఎదరయ్యే సమస్యలకు ఈ ఏడాది బోర్డు పరిష్కారం చూపింది. గతంలో కొన్ని యాజమాన్యాలు ఫీజులు కట్టలేదని, వివిధ కారణాలతో హాల్‌టిక్కెట్లు నిలుపుదల చేసేవారు. అటువంటి ఇబ్బందుల్ని దృష్టి ఉంచుకొని యాజమాన్యాలు హాల్‌టిక్కెట్లు ఇవ్వకపోయినా, వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లో చేసుకొని, దానిపై ప్రిన్సిపాల్‌ సంతకం లేకుండానే పరీక్షకు అనుమతిస్తారు. కాగా గత సంవత్సరం వరకూ ప్రిన్సిపాల్‌ సంతకం తప్పనిసరి. పరీక్ష కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ వద్ద తప్ప ఇతరులకు సెల్‌ఫోన్లు అనుమతించరు. సిఎస్‌ వద్ద కూడా బోర్డు ఇచ్చిన సిమ్‌తోకూడిన ఫోన్‌ మాత్రమే ఉంటుంది. విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చే ఫిర్యాదు చేయటానికి ఆర్‌ఒఐ కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. 7815968897, 0863-2228528 నంబర్లకు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం : ఆర్‌ఐఒ జి.కె.జుబేర్‌
మెటీరియల్‌ మొత్తం వచ్చింది. జిల్లాలో గుర్తించిన 16 స్టోరేజి పాయింట్లకు మెటీరియల్‌ను చేర్చి, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతాం. నాలుగు ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశాం. చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బందికి శిక్షణిచ్చాం. అన్ని పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, ఇంటర్‌ బోర్డుకు, ఆర్‌ఐఒ కార్యాలయానికి వాటిని అనుసంధానం చేసి, నిరంతరం పర్యవేక్షిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకూ గురికాకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలు రాయాలి.

➡️