ఇంటి స్థలం ఇప్పించి న్యాయం చేయండి

Jan 24,2024 21:32

ప్రజాశక్తి-బొబ్బిలి : ఇంటి స్థలం ఇప్పించి న్యాయం చేయాలని రామభద్రపురం శ్రీరామ్‌ నగర్‌ కాలనీకు చెందిన ఇద్దరు పేద మహిళలు డిమాండ్‌ చేశారు. రామభద్రపురం మండల కేంద్రంలో అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అనర్హులకు ఇస్తున్నారని ఆరోపిస్తూ పి.పార్వతి, కె.సింహచలం బుధవారం ఆర్‌డిఒ కార్యాలయం ముందు ప్లకార్డులను పట్టుకుని బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు సొంత ఇల్లు, ఇంటి స్థలం లేనప్పటికీ అధికారులు ఇంటి స్థలం ఇవ్వడం లేదని వాపోయారు. అద్దె ఇంటిలో నివాసముంటున్నామని, పేద కుటుంబం కావడంతో అద్దెలు చెల్లించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 90రోజులు ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకున్నప్పటికి ఇవ్వడం లేదని చెప్పారు. అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్‌డిఒ సాయిశ్రీకు వినతిపత్రం అందజేశారు. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఆర్‌డిఒ హామీ ఇచ్చారు.

➡️