ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు సర్వర్‌ కష్టాలు

ప్రజాశక్తి -ఒంగోలు సబర్బన్‌ : ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు సర్వర్‌ కష్టాలు తప్పడం లేదు. సర్వర్‌ ఆలస్యంగా వస్తుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో 22వేల మంది పేదలకు ఈనెల 23న ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ముహుర్తం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో లాటరీ పద్దతి ద్వారా ప్లాట్ల కేటాయింపు చేసింది. కేటాయించిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ పక్రియ గడిచిన నాలుగు రోజుల కిందట ప్రారంభించింది. సచివాలయల వారీగా రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ సర్వర్‌ ఆలస్యంగా వస్తుండటంతో ఒక్కో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్‌కు 30 నుంచి 40 నిమిషాల వరకు సమయం పడుతోంది. సర్వర్‌ వేగంగా వస్తే 10 నిమిషాలు పడుతోంది. ఈక్రమంలో రోజుకు ఒక్కో సచివాలయంలో నలభైనుంచి యాభై రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. ప్రాంతాలు ఎక్కువగా ఉన్న సచివాలయాలాలలో ఐదు వందల నుంచి వెయ్యి వరకూ లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా రోజు సచివాలయాలకు వస్తున్నారు. ఎవరు ఏరోజు రావాలనే సమాచారం నిర్ధిష్టంగా లేక పోవడంతో ఒక్కో సచివాలయం వద్దకు వందల సంఖ్యలో లబ్ధిదారులు వస్తున్నారు. వారంతా తమ పేరు ఎప్పుడు పిలుస్తారో అర్ధంకాక సచివాలయాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు 23న సిఎం వస్తుండటం, ఆరోజే సిఎం చేతులు మీదుగా అందరికి పట్టాలు ఇస్తారని చెప్పడంతో ఈలోపు తమ పేరు రిజిస్ట్రేషన్‌ అవుతుందో…?లేదో..? అనే ఆందోళన లబ్ధిదారుల్లో కనిపిస్తుంది. వాస్తవానికి 23న సిఎం వచ్చి కొంతమందికి మాత్రమే లాంఛనంగా పట్టాలు ఇవ్వనున్నారు. తరువాత సచివాలయాల వారీగా సమావేశాలు నిర్వహించి పట్టాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈపాటికే ప్రకటించి ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన వరకే రిజిస్ట్రేషన్లు చేస్తారని, తరువాత చేయరనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లడంతో లబ్ధిదారులంతా సచివాలయాల వద్ద రిజిస్ట్రేషన్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. అందరికి రిజిస్ట్రేషన్‌ చేస్తాం: మేయర్‌ లబ్ధిదారులందరీ రిజిస్ట్రేషన్‌ నిర్వహిస్తామని నగర మేయర్‌ గంగాడ సుజాత తెలిపారు. సచివాలయాలలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘ప్రజాశక్తి’ మేయర్‌ దృష్టికి తీసుకు వెళ్లగా ఆమె స్పందించారు. ఈనెల 23న సిఎం కార్యక్రమం లోపు లబ్ధిదారులందకి రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేయాలనే లక్ష్యంతో సచివాలయాలలో పని జరుగుతోందని తెలిపారు. అయితే సర్వర్‌ సక్రమంగా రాకపోవడంతో రిజిస్ట్రేషన్‌లు ఆలస్యంగా అవుతున్న విషయాన్ని తాము కూడా గుర్తించామని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి పర్యటనలోపు ఎంతవరకు సాధ్యమైతే అంతమందికి రిజిస్ట్రేషన్‌లు చేస్తామని, మిగిలిన వారికి సిఎం పర్యటన తరువాత కూడా రిజిస్ట్రేషన్‌ కొనసాగిస్తామని తెలిపారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్ట్రేషన్‌ పరిశీలన….నగరంలోని పలు సచివాలయాల్లో నిర్వహిస్తున్న ఇళ్ల స్ధలాల రిజిస్ట్రేషన్‌ను నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు, డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవరావు బుధవారం పరిశీలించారు. రాజపానగల్‌ రోడ్డులోని 29,30 డివిజన్ల సచివాలయాలలో కమిషనర్‌ పరిశీలించారు.రిజిస్ట్రేషన్‌ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సచివాలయ సిబ్బందితో చర్చించారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌లలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.

➡️