ఉపాధ్యాయినిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి : యుటిఎఫ్‌

Jun 24,2024 23:10

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌కుమార్‌, విజయసారధి
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఏపీవోగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయిని షేక్‌ షేహనాజ్‌ బేగంపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారధి కోరారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ శ్రీ కేశ్‌ బి లత్కర్‌ను సోమవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం ఘటన నేపథ్యంలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్‌ చేశారని చెప్పారు. దుర్ఘటనలో వీరి ప్రమేయం ఏమీ లేకున్నా చర్యలు తీసుకున్నారన్నారు. ఒక ఉద్యోగి ఆ స్థాయికి రావడానికి ఉద్యోగితో పాటు కుటుంబ సభ్యుల శ్రమ ఎంతో ఉంటుందని, ఆ ఉద్యోగి పైనే ఆ కుటుంబమూ ఆధార పడి ఉంటుందనే విషయం గ్రహించాలని కోరారు. ఎన్నికల విధుల్లో భాగంగా సస్పెండ్‌ అయిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలని తాజాగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చినా షహనాస్‌ బేగంపై సస్పెన్షన్‌ను ఎత్తేకకపోవడం సరికాదన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో సస్పెన్షన్లను తొలగించారని, పల్నాడు జిల్లాలోనూ సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి హామీనిచ్చారు.

➡️