ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు

క్రీడా స్థలాన్ని పరిశీలిస్తున్న జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ

 ప్రజాశక్తి – ఆరిలోవ: నగర ప్రజలకు క్రీడా ప్రాంగణాలను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రతి జోన్‌లో స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు జివిఎంసి ప్రణాళికలు రూపొందిస్తుందని కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ తెలిపారు. జోన్‌ 2 పరిధి ఆరిలోవ హెల్త్‌ సిటీ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని జివిఎంసి అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఇండోర్‌ స్టేడియం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 2.8 ఎకరాల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ప్రజల క్రీడా సౌలభ్యం కోసం ఇండోర్‌ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పర్యవేక్షక ఇంజినీర్‌ శాంసన్‌రాజును ఆదేశించారు. ఈ ప్రతిపాదిత స్థలంలో ఉన్న చెట్లకు ఆటంకపరచకుండా, రక్షణ గోడను ఏర్పాటుచేస్తూ స్టేడియంలో క్రీడలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు, మౌలిక వసతులు ఉండేటట్లు ప్రణాళిక సిద్ధం చేసి నివేదికను సమర్పించాలని కమిషనర్‌ ఆదేశించారు. అనంతరం హెల్త్‌ సిటీ రోడ్లను పరిశీలించి రోడ్లకు ఇరువైపులా పచ్చ దనాన్ని పెంపొందించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని శాంసన్‌ రాజుకు సూచించారు. హెల్త్‌ సిటీ ప్రాంతంలో నిత్యం పరిశుభ్రతా పనులు చేపట్టాలని హెల్త్‌ ఆఫీసర్‌ కిషోర్‌ను కమిషనర్‌ ఆదేశించారు. అనంతరం 12వ వార్డు పరిధి క్రాంతినగర్‌ లే-అవుట్‌ సమీపంలో ఖాళీ స్థలాన్ని పరిశీలించి, ఆ ప్రదేశంలో పార్కు నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేయాలని శాంసన్‌ రాజును ఆదేశించారు. పెదగదిలి నుంచి తోటగురువు వెళ్లే మార్గంలో 60 అడుగుల రోడ్డు విస్తరణ, కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, ఇఇ శాంతి రాజు, ఎసిపి శాస్త్రి, ఎఇ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు

➡️