ఇక చెప్పడం ఉండదు…చర్యలే

Mar 21,2024 20:36

కోడ్‌ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలి

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం : క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. కోడ్‌ ఉల్లంఘనపై దృష్టిపెట్టి కేసులు నమోదు చేయాలని సూచించారు. నిర్లిప్తతను విడనాడాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడ్‌ అమల్లోకి వచ్చి ఇప్పటికే 72 గంటలు గడువు దాటిపోయిందని, నిబంధనలను అమలు చేయనివారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తాహశీల్దార్లు, ఎంపిడిఒలు, పోలీసు అధికారులు, ఎంసిసి బృందాలు, ఇతర ఎన్నికల సిబ్బందితో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక గురువారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నమోదైన కొన్ని సంఘటనలపై క్షేత్రస్థాయి అధికారులనుంచి తమకు ఇంతవరకు సమాచారం రాకపోవడం పట్ల నిలదీశారు. ఇకనుంచీ ఇలాంటి సంఘటనలను సహించేది లేదన్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి సాధారణ అధికారులతోపాటు, పోలీసు సిబ్బందిని కూడా నియమించామని, వీరంతా పరస్పరం సమన్వయంతో, మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని సూచించారు. ఎట్టిపరిస్థితిలోనూ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరగకూడదని, జరిగితే తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కోడ్‌ ఉల్లంఘన సంఘటనలకు స్థానిక అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎంసిసి, ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల బృందాలు సంబంధిత ఆర్‌ఒ కిందనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.ఎన్నికలకు సంబంధించి సువిధ వెబ్‌సైట్‌, యాప్‌ల ద్వారా మాత్రమే అనుమతులు జారీ చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రచారం, వాహనాలు తదితర అన్నిటికీ అనుమతులు అవసరమని తెలిపారు. దరఖాస్తు చేసిన వెంటనే వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. తాత్కాలిక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్పనిసరి అని, ఆ ఇంటి యజమాని నుంచి అంగీకార పత్రం ఉండాలని చెప్పారు. ఇంటింటి ప్రచారానికి కూడా అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరిగే ప్రచార ఖర్చులు పార్టీ ఖాతాలోకి వెళ్తాయని, నామినేషన్‌ వేసిన తరువాత చేసే ఖర్చు అభ్యర్ధి ఖాతాలో లెక్కిస్తారని తెలిపారు. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులు కొనసాగుతాయని, కొత్తగా పనులు మంజూరు కానీ, ప్రారంభం కానీ జరగకూడదని తెలిపారు. నిబంధనలను అతిక్రమించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలుంటాయని, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, ఇతర ఉద్యోగులను పూర్తిగా విధులనుంచి తొలగిస్తామని తెలిపారు. జిల్లా ఎస్‌పి దీపిక మాట్లాడుతూ, ఎంసిసికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేయాలన్నారు. ఏమాత్రం ఉల్లంఘన జరిగినా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అనుమతులు లేని కార్యక్రమాలను, ఎంసిసి ఉల్లంఘనలను ఫొటోలు, వీడియోలు తీసి, కేసు నమోదు చేయాలని ఎస్‌పి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, నోడల్‌ ఆఫీసర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

➡️