ఇదే నా చివరి మీటింగ్‌

Jan 12,2024 21:53

ప్రజాశక్తి-వేపాడ  :  స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే తన చివరి సమావేశమని ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడున్న సభ్యులంతా కంగుతిన్నారు. ఎందుకలా చెప్పారో అర్థం కాక వారిలో వారు గుసగుసలాడుకున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసి, స్థలాన్ని కేటాయించాలని తహశీల్దార్‌ కృష్ణ ప్రసాద్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. కొంతమంది సర్పంచులు మాట్లాడుతూ సమగ్ర భూ సర్వేలో తయారుచేసిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు వాలంటీర్ల చేతికి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అలాంటప్పుడు సర్పంచులుగా తమకు ఉన్న విలువ ఏమిటని నిలదీశారు. సమావేశంలో ఎంపిపి డి.సత్యవంతుడు, డిసిసిబి చైర్మన్‌ వి.చిన్నరామినాయుడు, జెడ్‌పిటిసి ఎస్‌.అప్పలనాయుడు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సన్యాసినాయుడు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎన్‌.వెంకట్రావు, తహశీల్దార్‌ కృష్ణప్రసాద్‌, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ ఉమ, తదితరులు పాల్గొన్నారు.

➡️