ఇదే సమయం… ఇక కానిచ్చేద్దాం

ప్రజాశక్తి – మక్కువ : ఉన్నతాధికారుల ఆదేశాలుండాలే కానీ దాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో విద్యుత్‌ శాఖ అధికారులకు ఉన్న తెలివితేటలు వేరొకరికి ఉండవని చెప్పడంలో అతిశయోక్తి కాదు. పార్వతీపురం ఆర్‌డిఒ ఇలా ఆదేశాలు ఇచ్చారో లేదో గానీ శంబర విద్యుత్తు లైనుకు సంబంధించిన పనులు చేపట్టారు. అయితే అధికారుల ఆదేశాలను తమకు ఆదాయం వచ్చే రీతిలో మరల్చుకుంటున్నారని విద్యుత్‌శాఖ సిబ్బందిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే…మండల కేంద్రం నుంచి శంబరకు విద్యుత్‌ టు లైన్‌ వెళ్తోంది. ఓ ప్రైవేటు పాఠశాలకు ఆనుకొని ఉన్న అలాగే పక్కనే ఉన్న ఖాళీ స్థలానికి ఆనుకొని ఉన్న విద్యుత్‌ స్తంభాలను ఆర్‌ అండ్‌ బి రోడ్డు వైపు మార్చేస్తున్నారు. ఒక విద్యుత్‌ స్తంభం పాడైపోతే అదే స్థానంలో కొత్తగా స్తంభాన్ని వేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా సుమారు నాలుగు అడుగుల నుంచి ఏడు అడుగుల దూరం వరకు విద్యుత్తు లైనను మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల ఆదేశాలను పక్కన పెడితే విద్యుత్‌ ఉన్నతాధికారుల జేబులు నింపేందుకు ఎంతో ఉపయోగకరంగా మారాయి అన్నది ఈ స్తంభాల మార్పు తీరును చూస్తే అర్ధమవుతుందని పలువురు చెబుతున్నారు. ఒక స్తంభాన్ని మార్చాలంటే ప్రభుత్వానికి షిఫ్టింగ్‌ ఛార్జీలు సంబంధిత వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకుండానే విద్యుత్‌ శాఖ చెందిన ఓ అధికారి సంబంధిత వ్యక్తులతో లాలూచీపడి ఈ మార్పులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కొండపుట్టి పంచాయతీ పరిధిలోని పలువురు రైతులు ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైందని, మార్చమని పలుమార్లు విజ్ఞప్తి చేసినా విద్యుత్‌ శాఖ అధికారులు పట్టించుకోలేదు. చేతులు తడిపే పనులు ఏకబిగిన చేస్తారన్న దానికి ప్రస్తుతం పై పనులే నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపినట్లైతే వాస్తవాలు వెలుగు చూసే ఆస్కారం లేకపోలేదని పలువురు కోరుతున్నారు.ఎడిఇ ఆదేశానుసారమే..ప్రస్తుతం మక్కువలో జరుగుతున్న విద్యుత్‌ స్తంభాల మార్పునకు సంబంధించి ఎడిఇ ఆదేశాల మేరకే పనులు జరుగుతున్నాయని మక్కువ లైన్మెన్‌ టి.సురేష్‌ తెలిపారు. శంబర వెళ్లే లైను సరి చేస్తున్నామన్నారు. పాత స్తంభాలు విద్యుత్‌ తీగలు వదులుగా ఉండడంతో అలా చేస్తున్నామని తెలిపారు.

➡️