ఇళ్లకు జువారి ఎఫెక్ట్‌

ప్రజాశక్తి – ఎర్రగుంట్ల దేశంలోనే సిమెంట్‌ రంగంలో ఎంతో పేరు గాంచిన సంస్థ జువారి సిమెంట్స్‌. నాణ్యత గల సిమెంట్‌కు పెట్టింది పేరుగా ప్రసిద్ధి. ఈ సిమెంట్‌ కర్మాగారం వల్ల వందల మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయనేది అందరికీ తెలిసిన సత్యం. కానీ అదే జువారి కర్మగారం పాదాల కింద పడి నలుగుతున్న గ్రామాలు కూడా ఉన్నాయన్నది అంతే సత్యం. కర్మాగారం చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు ఏదో ఒక సమస్యతో అల్లాడుతున్నారు. జువారి కర్మాగారం ఉన్న గ్రామా ల్లోని భూగర్భంలో నాపరాయి నిక్షేపాలు అధికంగా ఉండడం ఆ గ్రామాల ప్రజలకు వరమో… శాపమో…అర్థంకాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఆనాడు కర్మాగార నిర్మాణం కోసం ఎర్రగుంట్ల మండలంలోని వలసపల్లి, తుమ్మలపల్లి, కోడూరు, పెదనపాడు గ్రామాల ప్రజలు తమ భూములను త్యాగం చేశారు. ఇప్పుడు అదే కర్మాగారం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. కర్మగారంలో నాపరాయి తవ్వకాల కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌ కారణంగా మండలంలోని వలసపల్లి గ్రామంలో పలు ఇళ్లు బీటలు వారి కూలిపోయే పరిస్థితులలో ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వలసపల్లి గ్రామానికి కూతవేటు దూరంలోనే జువారి మైనింగ్‌ చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. మైనింగ్‌లో నిర్వహించే భారీ పేలుళ్ల కారణంగా భూమి కంపిస్తోందని, దానివల్ల ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. రోజూ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నాపరాయి తవ్వకాల కోసం మందు గుండు సామాగ్రితో భారీ పేలుళ్లు సష్టిస్తున్నారని, దాని కారణంగా లక్షలు విలువ చేసే ఇళ్లు శిథిలమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రజలు రూపాయి రూపాయి కూడా పెట్టి సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటుంటే, మైనింగ్‌ పుణ్యమా అంటూ కట్టుకున్న ఇళ్లు కూలిపోతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ జీవించే పరిస్థితులలో ఉన్నామంటూ ఆందోళన చెందు తున్నారు. సాధారణంగా 42 నుంచి 50 ఏళ్లు ఉండాల్సిన ఇళ్లు బ్లాస్టింగ్‌ కారణంగా 15 నుంచి 20 ఏళ్లకే శిథిలావస్థకు చేరుతున్నాయని పలు వురు వాపోతున్నారు. బ్లాస్టింగ్‌ జరిగిన సమయంలో ఏర్పడే దుమ్ము గ్రామం మొత్తం వ్యాపిస్తోందని, దుమ్ముతో సహజీవనం చేస్తు న్నామని పేర్కొంటున్నారు. అధికారులకు, జువారి యాజ మాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని వెల్లడించారు. ఇలాగే కొనసాగితే గ్రామం వదిలి వెళ్లాల్సి ందేనని, వేరే గత్యంతరం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సమస్యను గుర్తించి జువారి యాజమాన్యం, అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.నిలువు నీడ లేకుండా పోతోంది… జువారి కర్మాగారం నాపరాయి కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌ కారణంగా గ్రామంలోని ఇళ్లు చాలా వరకు శిథిలావస్థకు చేరు కున్నాయి. బ్లాస్టింగ్‌ సమయంలో భూమి మొత్తం ఒక్కసారిగా కంపిస్తోంది. ఒక్కోసారి ఇళ్లలోని వస్తువులు కూడా కింద పడతాయి. ఆశగా నిర్మించుకున్న ఇళ్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంటే బాధపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. బ్లాస్టింగ్‌ సమయంలో ఏర్పడే దుమ్ముతో ఒకవైపు పంట పొలాలు నాశనం అవుతుంటే మరోవైపు బ్లాస్టింగ్‌ కారణంగా కట్టుకున్న ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. గ్రామస్తులకు కళ్ళెదుటే నిలువు నీడ లేకుండా పోతోంది. జువారి యాజమాన్యం సమస్యపై స్పందించి న్యాయం చేయాలి.- సుదర్శన్‌రెడ్డి, గ్రామస్తుడు, వలసపల్లి.

➡️