ఇళ్ల పట్టాల కోసం దళవారీ ఆందోళనలు

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న పాశం రామారావు తదితరులు
ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రకటించారు. ఈ మేరకు కరపత్రాన్ని స్థానిక సిపిఎం కార్యాలయంలో నాయకులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ మంగళగిరి కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని, 16వ తేదీన దీక్షా శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రారంభిస్తారని తెలిపారు. 20వ తేదీన మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ మంగళగిరి కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వేలాదిమంది 40 ఏళ్ల నుండి వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నారని, ఇప్పటికీ సుమారు 20 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు లేవని అన్నారు. గతంలో టిడిపి, కాంగ్రెస్‌, ప్రస్తుతం వైసిపి ప్రభుత్వాలు సైతం తాము అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్దానాలు చేశారేగాని, ఆచరణలో అమలు చేయలేదని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాలు పోరాటాల ద్వారా నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంగళగిరి పట్టణంలో రత్నాల చెరువు, కొండ చట్టు ప్రాంతం, పానకాల స్వామి గుడిమెట్ల వద్ద, పావురాల కాలనీ తదితర ప్రాంతాల్లో సుమారు 6 వేల కుటుంబాలు వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని ఉంటున్నారని, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాడేపల్లి పట్టణంలోని సుందరయ్య నగర్‌, కృష్ణ నగర్‌, రామయ్య కాలనీ, పుష్కరాల సందర్భంగా రోడ్డు మార్జిన్‌ ఉన్న వారిని తొలగించారని వీరికి ఇంతవరకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వలేదని అన్నారు. రైల్వే స్థలాల్లో సుమారు 600 కుటుంబాలు ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని చెప్పారు. పిడబ్ల్యూడి కట్టలపై సుమారు 1200 కుటుంబాలు వారు నివసిస్తున్నారని తెలిపారు. మొత్తంగా 7 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు లేవని వివరించారు. కొండ చుట్టూ ఉన్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ల సౌకర్యం లేకుండా చేశారని అన్నారు. మంగళగిరి రూరల్‌ మండలం ఆత్మకూరులోని నిమ్మగడ్డ రామ్మోహన్‌రావు నగర్‌, వైయస్సార్‌ కాలనీ, హనుమాన్‌ నగర్‌ తదితర కాలనీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా, ఇటీవల రోడ్డు వెడల్పు పేరుతో వందలాది కుటుంబాలను అక్కడి నుండి తొలగించారని విమర్శించారు. కాజలో పుల్లయ్య నగర్‌, సుందరయ్య నగర్‌ ప్రాంతాల్లో 600 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు లేవన్నారు. పెదవడ్లపూడిలో రైల్వే స్టేషన్‌ రోడ్‌లో నివాసముండే పేదలను తొలగించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. దుగ్గిరాల మండలంలో రేవేంద్రపాడు, మోరంపూడి, దుగ్గిరాల తదితర ప్రాంతాల్లో పేదలు ఇరిగేషన్‌ కట్టలపై దీర్ఘకాలంగా నివాసం ఉంటున్నారని తెలిపారు. నియోజవర్గంలో కృష్నానది పరివాహక ప్రాంతంలో ఇరిగేషన్‌ కట్టలపై సుమారు 3 వేల కుటుంబాలు ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నారని, వీరికి పట్టాలు ఇవ్వాలని కోరారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివశంకర్‌రావు, జెవి రాఘవులు మాట్లాడుతూ తాడేపల్లి ప్రాంతంలో వేలాదిమంది ఇళ్ల పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దశల వారి ఆందోళనకు ఈ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభ్యంతరం లేని భూముల్లో ఇళ్లేసుకుని జీవిస్తున్న వారికి వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి మాట్లాడుతూ నిడమర్రు, కురగల్లు, నవులూరు, పెనుమాక, ఎర్రబాలెం గ్రామాల్లో పేదలు ఇళ్లేసుకున్నారని, వారికి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, సీనియర్‌ నాయకులు ఎం.పకీరయ్య, పి.బాలకృష్ణ, మంగళగిరి, తాడేపల్లి పట్టణ కార్యదర్శులు వై.కమలాకర్‌, బి.వెంకటేశ్వర్లు, దుగ్గిరాల మండలం కార్యదర్శి జె.బాలరాజు పాల్గొన్నారు.

➡️