ఇసుక ముసుగులో గం’జాయి’

Jan 6,2024 20:52

ప్రజాశక్తి- శృంగవరపుకోట: అధికారం అండతో పాటు పోలీసుల అండదండులు తోడవడంతో చాలా మంది అక్రమార్కులు ఇసుక, మట్టి తరలింపు మాటున గంజాయి, కైనీ, గుట్కా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెక్‌ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేయాల్సిన పోలీసులు కూడా వత్తాసు పలకడంతో అక్రమ రవాణా మాఫియా వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా సాగిపోతుంది. పగటి పూట ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది అధికార యంత్రాంగం చీకటిపడితే అక్రమ రవాణా దారులను వెనుక నుంచి ప్రోత్సహిస్తూ కాసులు పోగేసుకుంటున్నారు. దీంతో మత్తు పదార్థాల తరలింపునకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఫలితంగా యువత పెడదారిన పడి గంజాయి మత్తులో ఊగుతున్నారు..మండలంలోని బొడ్డవర కేంద్రంగా ఉన్న ఇసుక మాఫియా రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. గోస్తనీ నది పరివాహక ప్రాంతాలైన చిలకల గెడ్డ, తాటిపూడి కాటేజి వంటి ప్రాంతాల నుండి ఇష్టానుసారం ఇసుకను తోడేస్తున్నారు. వాల్టా చట్టాన్ని సైతం అతిక్రమించి భూగర్భ జలాలను దెబ్బతీస్తున్నారు. మట్టి రవాణా విషయానికొస్తే ఇది అనునిత్యం జరిగే ప్రక్రియలా మారిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే రాత్రి వేళల్లో జరిగే ఈ దందాలో జిల్లా సరిహద్దు ప్రాంతమైన బోడ్డవర చెక్‌ పోస్ట్‌ దాటి మండలంలోకి ప్రవేశించడంతో ఇసుక, మట్టి రవాణా మాటున గంజాయి, ఖైని, గుట్కా తరలిపోతుందనే ఆరోపణులు గట్టిగా వినిపిస్తున్నాయి. మండలానికి సరిహద్దుగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయితీ గోస్తనీ నది పరివాహక ప్రాంతాల నుంచి మండలంలోని బొడ్డవర ప్రాంతానికి చెందిన ఇసుక వ్యాపారులు ట్రాక్టర్లు, లారీలతో పెద్ద ఎత్తున ప్రతిరోజు రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. అక్కడి నుండి మైదాన ప్రాంతమైన బొడ్డవర, రాజీ పేట, ఎస్‌ కోట, గంట్యాడ, లక్కవరపుకోట ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం ప్రకారం ఎటువంటి మైనింగ్‌, ఇసుక తవ్వకాలకు అనుమతులు లేనప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి అక్రమంగా ఇసుక, దాని మాటున గంజాయి తరలిపోతున్నా అనంతగిరి పోలీసులు, అధికారులు గానీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే అదునుగా అంతర్‌ జిల్లాల సరిహద్దు అయిన బొడ్డవర ప్రాంతంలోని అధికార పార్టీ నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. దీంతో చెక్‌ పోస్ట్‌ పోలీసులు చేసిందేమీ లేక ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్‌ నుంచి రూ.500 వసూలు చేస్తున్నారని, ఒక్కోసారి ఇసుక మాటున గంజాయి కూడా రవాణా అవుతుందని, సుమారు నెల రోజుల కిందట బొడ్డవర నుండి తాటిపూడికి వెళ్లే రహదారిలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పట్టుకున్న గంజాయి ఇసుక మాటున ట్రాక్టర్‌ ద్వారా తీసుకువచ్చి బోలోరో వాహనంలోకి మార్చి తరలిస్తుండగా దొరికినట్లు తెలిస్తోంది. పైగా ఖైనీ, గుట్కా నియోజకవర్గంలోని ప్రతి దుకాణంలో జోరుగా అమ్మకాలు యదేచ్చగా సాగుతున్నా గత రెండు మూడేళ్లగా ఖైనీ, గుట్కాల అక్రమ రవాణా వాహనాలను పట్టుకున్న దాఖలాలే లేకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక, మట్టి తరలింపు మాటున జరుగుతున్న గంజాయి, గుట్కా, ఖైనీ తరలింపును చెక్‌ పోస్టు వద్దనే నివారించాలని పలువురు కోరుతున్నారు.బొడ్డవర చెక్‌ పోస్ట్‌ పై ప్రత్యేక నిఘమండలంలోని బొడ్డవర అంతర్‌ జిల్లాల చెక్‌ పోస్ట్‌ వద్ద రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా అవుతుందన్న సమాచారంతో చెక్‌ పోస్ట్‌ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చెక్‌పోస్ట్‌ దాటి మండలంలోకి ప్రవేశించే ఎటువంటి వాహనాన్నైనా తనిఖీ చేయాల్సిందేనని, వాహనానికి సరైన పత్రాలు లేకపోయినా, వాహనంలో ఉన్న లోడుకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా అటువంటి వాహనాలను విడిచిపెట్టకూడదని చెక్‌ పోస్ట్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. వాహనాలు చెక్‌ పోస్ట్‌ వరకు రాకుండా మండలంలోకి ప్రవేశించేందుకు గల మరొక మార్గంలో కూడా రాత్రి వేళల్లో గస్తీ కాస్తున్నాం. జి. లోవరాజు, ఎస్‌ఐ, ఎస్‌కోట.

➡️