ఉచిత సలహాలు మానుకొని రైతులను ఆదుకోవాలి

Dec 8,2023 20:32

 ప్రజాశక్తి-విజయనగరంకోట  :  తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. ఒకప్పుడు తుపానుతో పాటు గాలి వచ్చేదని, ఇప్పుడు తుపానుతో ప్రభుత్వ ఉచిత సలహాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం విజయనగరం నియోజకవర్గ పరిధిలో మలిచర్ల గ్రామంలో తుపాను వల్ల నష్టం కలిగిన వరిచేలను పరిశీలించారు. వరిపంట మొత్తం నీట మునిగి సర్వ నాశనం అయిపోయిందని రైతులంతా అశోక్‌గజపతిరాజు వద్ద కన్నీరుపెట్టారు. పంట పొలాలను ప్రత్యక్షంగా చూసి, వారి ఆక్రందన విని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ వందల ఎకరాల పంట నీట మునిగి పోయిందనిఇ, వేలాది రూపాయలు నష్టం వాటిల్లిందని తెలిపారు. మా కష్టాలను పరిశీలనకు వచ్చిన అధికారులతో చెప్పితే రైతు భరోసా కేంద్రాలు, విఆర్‌ఒలు వరిచేలను ఆరబెట్టి ఉప్పునీరు చల్లమంటున్నారని వాపోయారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా ఎవరూ పాటించలేని సలహాలు రైతాంగానికి ఇచ్చి పక్కతోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా ఇంటికి పంపితే అంత వేగంగా ప్రజలందరికీ మేలు కలుగుతుందని అన్నారు. ఆయన వెంట విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలి నాయుడు, రాష్ట్ర బిసి సెల్‌ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కార్యాలయం కార్యదర్శి రాజేష్‌ బాబు, కనకల మురళీమోహన్‌, కర్రోతు నర్సింగరావు, కోండ్రు శ్రీనివాసరావు, పైడ్రాజు, సుంకర పేట, మలిచర్ల గ్రామం రైతులు, నాయకులు పాల్గొన్నారు.

➡️