ఉత్తరాంధ్ర దోపిడీకి ఆ ముగ్గురికే లైసెన్స్‌

Feb 14,2024 21:31

 ప్రజాశక్తి-సాలూరు,పార్వతీపురం రూరల్‌, బాడంగి  : ఉత్తరాంధ్ర జిల్లాల దోపిడీకి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ముగ్గురు వైసిపి నేతలకు లైసెన్సు ఇచ్చారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. వారు ఈ ప్రాంతంలో భూ కబ్జాలు, దందాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరించడంతో పాటు జిల్లాకొక కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. టిడిపి చేపట్టిన శంఖారావంలో భాగంగా బుధవారం పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గం బాడంగిలో జరిగిన సభల్లో నారా లోకేష్‌ మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలను దోచుకోవడానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డిలకు జగన్‌ లైసెన్స్‌ ఇచ్చారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో భూముల కబ్జా, దందాలు ఆ ముగ్గురి కనుసన్నల్లో జరిగాయని విమర్శించారు. నియోజకవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం రాజన్నదొర రిమోట్‌ కంట్రోల్‌ నాయకుడని అన్నారు. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు చేతిలో రిమోట్‌ వుంటుందని, ఆయన లెఫ్ట్‌కు తిరగమంటే లెఫ్ట్‌కు, రైట్‌కు తిరగమంటే రైట్‌కు రాజన్నదొర తిరుగుతారని అన్నారు. ఆయన ఇంకు లేని పెన్ను లాంటి వారని, పెన్ను మాత్రమే ఈయన దగ్గర వుంటుందని, ఇంకు మాత్రం మజ్జి శ్రీనివాసరావు వద్ద వుంటుందని వ్యంగంగా అన్నారు. ఉపముఖ్యమంత్రి అయినా గిరిజనుల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. పెద్ద ఎత్తున భూకబ్జాలు చేసి బినామీ పేర్లపై పెట్టారని విమర్శించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలోనూ రాజకీయాలు జొప్పించారని,మన్యం జిల్లా లో గెలిచిన పాచిపెంట జట్టును ఫైనల్స్‌కు పంపకుండా రాజకీయం చేశారని ఆరోపించారు.

ఇలాంటి ఎమ్మెల్యేను దేశంలోనే చూడలేదు

పార్వతీపురం సభలో స్థానిక ఎమ్మెల్యే అలజంగిజోగారావుపై లోకేష్‌ విమర్శలు గుప్పించారు. ఇక్కడి ఎమ్మెల్యేకి అవినీతిరావు అని పేరు పెట్టాలేమో అన్నారు. భూములు కబ్జా చేస్తాడని, చెరువులను పూడ్చి పట్టాలు సృష్టిస్తాడని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు అమ్ముకుంటాడని ఆరోపించారు. ఏకంగా ఎమ్మార్వో సంతకాలే ఫోర్జరీ చేస్తారని.. ఇలాంటి ఎమ్మెల్యేను దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. ఎ1,ఎ2లు జగను సాయి రెడ్డి అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఎ3 గా అనుకోవచ్చని అన్నారు.జిల్లాకు జగన్‌ నేరవర్చని 50 హామీలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పర్యటన సందర్భంగా జగన్‌ 50 హామీలు ఇచ్చారని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని లోకేష్‌ అన్నారు భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ను, రామతీర్థ సాగర్‌, పెద్దగెడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, గోస్తా-చంపావతి నదుల అనుసంధానం చేయలేదని తెలిపారు. టిడిపి-జనసేన అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు.కియా మాదిరిగా ఉత్తరాంధ్రకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువస్తాం. పార్వతీపురం నియోజకవర్గానికి హామీలుతాము అధికారంలోకి వస్తే పార్వతీపురం పట్టణానికి బైపాస్‌ రోడ్డు, ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షితనీరు, డంపింగ్‌ యార్డును తరలించి మోడ్రన్‌ పట్టణంగా తీర్చుదిద్దుతామన్నారు. జంఘావతి, అడారు మినీ రిజర్వాయర్‌ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీతానగరం, బలిజిపేట మండలాలకు తోటపల్లి సాగునీరు అందిస్తామన్నారు. నియోజకవర్గంలో స్పోర్ట్స్‌ స్టేడియం కట్టిస్తామన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ కోరాడ నారాయణరావుపై జరిగిన దాడిని పార్టీ తీవ్రంగా ఖండించిందని తెలిపారు.

బాడంగిలో సభకు ముందు నారా లోకేష్‌ను అరకు పార్లమెంట్‌ పరిధిలోని 32 మండలాల పరిధిలోని పాస్టర్‌ హెడ్‌లు కలిసి సమస్యలను విన్నవించారు. తమకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అసెంబ్లీలో తమ వాణి వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. క్రిష్టియన్‌ మైనార్టీలకు ప్రత్యేక కార్పోరేషన్‌, బైబిల్‌ కాలేజి ఏర్పాటు చేయాలన్నారు. లోకేష్‌ మాట్లాడుతూ… యువగళం పాదయాత్రలో క్రిష్టియన్‌ మైనార్టీలు సమస్యలను స్వయంగా చూశానని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చర్చిల నిర్మాణాలకు సహకారం అందిస్తామన్నారు. బరియల్‌ గ్రౌండ్స్‌ ఏర్పాటుతో పాటు ప్రహరీలు నిర్మిస్తామన్నారు.అనంతరం జరిగిన సభలో లోకేష్‌ మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే శంబంగి ఇంకులేని పెన్నులాంటి వారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడును పదవుల్లో న్యాయం చేయలేకపోయామని, తన తప్పిదం వల్లే జరిగిందని, మరోసారి అలా జరగకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మునాయుడును చట్ట సభలకు పంపిస్తామని ప్రకటించారు. బాడంగి మండలంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. కొండదేవరపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు ప్రారంభిస్తామని, బాడంగి, రామభద్రపురం మండలాలకు పెద్దగెడ్డ నీరందిస్తామని తెలిపారు. ఇక్కడ ఎరుకుల పాకలో సర్పంచ్‌, ఎంపిటిసిలు పాలవలస గౌరును అభివృద్ధి పనులు చేయకుండా వృత్తులకు అడ్డుపడుతూ కేసులు పెడుతూ అధికారులు భయపెడుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టేది లేదని అన్నారు.

పార్వతీపురంలో సభాధ్యక్షులు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మన ఇళ్లపైకి గూండాలను, పోలీసులను పంపి వేధిస్తున్నారు, మీకు వడ్డీతో సహా తిరిగి చెల్లించేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించరు. సాలూరులో సభకు అధ్యక్షత వహించిన నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మంజూరైన జైకా నిధులను కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. బాడంగిలో బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన మాట్లాడుతూ నియోజకవర్గడంలో నెలకొన్న సమస్యలను వివరించారు. సభల్లో అరకు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిడారి శ్రావణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యేలు బొబ్బిలి చిరంజీవులు, ఆర్‌పి భంజ్‌దేవ్‌, తెంటు లక్ష్మునాయుడు, జనసేన నాయకులు లోకం మాధవి, బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి, పార్వతీపురం ఇన్‌ఛార్జి ఆదాడ మోహనరావు తదితరులు మాట్లాడారు.లోకేష్‌కు వినతులుపార్వతీపురంలో వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేతకు పెద్దఎత్తున వినతిపత్రాలు అందజేశారు. సిపిఎస్‌, జిపిఎస్‌లను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

➡️