ఉద్యోగాల కల్పనలో దొందూదొందే

Jan 27,2024 20:57

ప్రజాశకి – విజయనగరం ప్రతినిధి  : ఉద్యోగ కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందుగానే వ్యవహరిస్తున్నాయనే వాదన జనం నోట చర్చ నీయాశమౌంతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసి మోసపోయిన నిరుద్యోగులతోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాలకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోడీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగావున్న పోస్టులన్నీ భర్తీ చేస్తానని, ఇందుకోసం ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ విధితమే. దీంతో, జనం జగన్‌కు పూర్తి మెజార్టీ ఇచ్చారు. కానీ, జాబ్‌ క్యాలెండర్‌ కాదు సరికదా కనీసం ఖాళీ అవుతున్న పోస్టులను కూడా భర్తీ చేయలేదు. డిఎస్‌సి విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు. కేంద్రం అమలు చేస్తున్న నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాలల విలీనం పేరుతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వందలాది స్కూళ్లను ఎత్తివేశారు. దీంతో ఆమేరకు ఉపాధ్యాయ పోస్టులు గల్లంతయ్యాయి. మెగా డిఎస్‌సి వెంటనే ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో గురువారం నిరుద్యోగులు విజయనగరంలో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి కోటజంక్షన్‌ వరకు భారీ ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ మానవహారం చేపట్టారు. విద్య వ్యాపారమయంగా మారిన నేపథ్యంలో బిఇడి, టిటిసి వంటివి పూర్తిచేయడం, ఆ తరువాత డిఎస్సీ క్వాలిఫై కావడం అంటే మాటలు కాదు. సమయంతోపాటు ఫీజుల రూపంలో నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లకు లక్షల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి ఉంది. వైసిపి అధికారంలోకి సచివాలయ ఉద్యోగాలు మినహా ఒక్క శాఖల్లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎక్కువ మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఊసే లేదు. కేంద్ర విద్యా శాఖ మంత్రి మన రాష్ట్రంలో 50వేల పోస్టులు ఖాళీలున్నాయని పార్లమెంట్‌లో ప్రకటిస్తే, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 714పోస్టులు మాత్రమే అంటూ ఒకరోజు, ఎనిమిది వేల పోస్టులు అని మరో రోజు…. రోజుకో రకంగా చేస్తున్న ప్రకటనలు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే చదువుకున్న యువత ఉపాధి పనులు చేయడం, వలసకూలీలుగా మారడం వంటివి పెరిగాయి. కనీసం స్వయం ఉపాధి పొందదామంటే ప్రభుత్వం నుంచి అటువంటి సహకారం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌ -2 పోస్టులు కూడా గడిచిన ఐదేళ్లగా తీయకపోవడం వల్ల సాక్షాత్తు మండల, జిల్లా స్థాయి అధికార పోస్టులు కూడా అంతకన్నా తక్కువస్థాయి గల అధికారులతో నింపారు. మన రెండు జిల్లాల్లో సగానికి సగం మంది దిగువ స్థాయి అధికారులతోనే జిల్లా స్థాయి పనులు చేయిస్తుండడం సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనమని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారు బాతులాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (విశాఖ స్టీల్‌ప్లాంట్‌)ను విదేశీ ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంతో ఇందులోని ఉద్యోగాలకు భద్రత ఉండే పరిస్థితి లేదు. దీంతో కొత్తగా ఉద్యోగాలు వచ్చేందుకు కూడా అవకాశాలు తగ్గిపోతాయి. ఈనేపథ్యంలో నిరుద్యోగులు, యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ మోసం చేసిన ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.

➡️