ఉద్యోగులను విస్మరిస్తే పతనం తప్పదు : సాబ్జీ

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని పక్షంలో రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వ ఓటమి తప్పదని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ హెచ్చరించారు. ఈనెల తొమ్మిది, పది తేదీల్లో యుటిఎఫ్‌ 49వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ఏలూరులో జరగనున్న నేపథ్యంలో శుక్రవారం స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని యుటిఎఫ్‌ 26 జిల్లాల ప్రతినిధులు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరై భవిష్యత్‌ కర్తవ్యాలు చర్చిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా సంస్కరణల వల్ల విద్యార్థుల డ్రాపవుట్స్‌ పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఎ, పిఆర్‌సి ఎరియర్స్‌, సరెండర్‌ లీవుల ఎగవేత, పిఎఫ్‌ రుణాలు, ఎపిజిఎల్‌ఐ రుణాఉల, గ్రాడ్యుటీ తదితర రూ.20 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే దానికి కారణం ఆర్థిక అరాచకత్వమేనని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం వెనక్కి తీసుకోవాలని, శాస్త్రీయ విద్యావిధానం అమలు చేయాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన సిఎం జగన్‌ దానికంటే ప్రమాదకరమైన జిపిఎస్‌ తీసుకొచ్చి ఉద్యోగుల నోట్లో మట్టికొట్టారని, దీనికోసం రానున్న రోజుల్లో పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాత పెన్షన్‌ విధానం ఇస్తామన్న ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయని, కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో తెలంగాణలో ప్రభుత్వం మారిందని, జగన్‌ మోహన్‌ రెడ్డి ఉద్యోగుల విషయంలో తన పద్ధతి మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో కూడా రానున్న ఎన్నికల్లో అదే జరుగుతుందని ఆయన హెచ్చరించారు. స్థానిక మినీ బైపాస్‌రోడ్‌లోని చలసాని గార్డెన్స్‌లో తొమ్మిది, పది తేదీల్లో జరిగే యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి కుమార్‌రాజా, బి.సుభాషిణి, ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్‌ ముస్తఫా అలీ, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ పాల్గొన్నారు.

➡️