ఉద్యోగుల ‘సమగ్ర’ నిరసన

ప్రజాశక్తి-కంభం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు మంగళవారం ఒంటి కాలిపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 16 నుంచి 19 వరకు పెన్‌డౌన్‌ చేసి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంబంధిత వ్యాపకాలకు దూరంగా ఉండి తమ ఆవశ్యకతను చాటిచెప్పారు. సమస్యలు తీరని పక్షంలో సమ్మె బాట తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌లు, పార్ట్‌ టైం ఉపాధ్యాయులు, ఐఇఆర్‌టిలు పాల్గొన్నారు. సిఎస్‌ పురంరూరల్‌: మండలంలోని సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన పెన్‌ డౌన్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు వారు తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు, ఎంఐఎస్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్టిలు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన పెన్‌డౌన్‌ దీక్ష మంగళ వారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెగ్యులైజేషన్‌, హెచ్‌ఆర్‌ పాలసీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌, చైల్డ్‌ కేర్‌ లీవ్‌, పితృత్వ సెలవులు ఇవ్వా లని కోరారు. ఉద్యోగులు ఈ దీక్షలో పాల్గొన్నారు. దర్శి: సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, మినిమం టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని యూటీఎఫ్‌ మండల అధ్యక్షులు మీనిగ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలోని అంబేద్కర్‌ భవనం వద్ద సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు సమ్మెకు మద్దతుగా యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు యలమందరెడ్డి, నాగేశ్వరరావు, కాశిం, కామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రామిరెడ్డి, తిరుపతిస్వామితో పాటు ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చంద్రం, కోటేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు. బేస్తవారిపేట: ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 16వ తేదీ నుంచి 19 వరకు పెన్‌ డౌన్‌ కార్యక్రమం నిర్వహించి, 20 నుంచి సమ్మె బాట పట్టనున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేస్తవారిపేట ఎంఆర్సీ వద్ద సీఐటీయూ తమ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు మాట్లాడుతూ శ్రమ దోపిడీని అరికట్టి తమను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని, ఉద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ కంబం కన్వీనర్‌ షేక్‌ అన్వర్‌, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️