ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారం రెండవ రోజుకు చేరింది. సమ్మెకు మద్దతుగా ఎస్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి అన్ని వర్తింపజేయాలని కోరారు. విద్యా శాఖలో ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో చేరడానికి కషి చేస్తున్న, విద్యా వ్యవస్థను బలపరుస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సాధారణ జీవితం గడపలేక పోతున్నారని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పర్మనెంట్‌ చేస్తానన్న హామీని నెరవేర్చాలని కోరారు. హెచ్‌ఆర్‌ఎ, డిఎ, టిఎ వర్తింపజేయాలని, సామాజిక పథకాలైన ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా చూడాలని, వడ్డీ లేని రుణాలు అందించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పార్ట్‌ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్‌ టైం కాంట్రాక్ట్‌ అమలు చేసి వేతనాలు పెంచాలని కోరారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు తలపెట్టే ఏ కార్యక్రమానికైనా తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎపిపిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిబాబు, సిఆర్‌ఎంటి ఆంజనేయులు, వై.చంద్రకళ, సిసిఆర్‌ సుధాకర్‌, పి.సుధాకర్‌, పిటిఐ లక్ష్మీదేవి, సమగ్రశిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️