ఉన్నతి పథకంలో మహిళలకు ఆటోలు

గుంటూరులో లబ్ధిదారులకు ఆటోలు అందచేస్తున్న కలెక్టర్‌, జెసి తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా ః మహిళా శక్తి ఆటో పథకం క్రింద మొదటి విడతగా గుంటూరు జిల్లాలో 8 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.24, 89,158ల విలువగల ఆటోలను, పల్నాడు జిల్లాలో ఐదుగురు మహిళలకు ఆటోలను గురువారం అందించారు. కలెక్టరేట్‌ ప్రాంగణాల్లో జరిగిన కార్యక్రమాల్లో లబ్ధిదార్లకు ఆటో తాళాలను గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామప్రసాద్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందించారు. ఈ సందర్భ:గా వారు మాట్లాడుతూ ఉన్నతి – మహిళ శక్తి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆటోలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. లబ్ధిదారు కోరుకున్న ఆటో మోడల్‌ ఖరీదులో పది శాతం వాటా చెల్లించాల్సి వుంటుందన్నారు. మిగిలిన 90 శాతం బ్యాంకుల ద్వారా రుణంగా వస్తుందన్నారు. రుణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని, లబ్ధిదారు రుణాన్ని 48 నెలవారీ వాయిదాల్లో వడ్డీ లేకుండా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు చెందిన స్వయం సహాయక సభ్యులు 18-45 ఏళ్లవారు అర్హులని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా డ్వామా, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు వెంకట శివరామిరెడ్డి, హరిహరనాథ్‌, పల్నాడు డిఆర్‌ఒ వినాయకం, డీఆర్‌డీఏ పీడీ బాలునాయక్‌ లబ్ధిదారులు పింకీ, తిరుపతమ్మ, ప్రశాంతి, సుస్మిత, లక్ష్మీ తిరుపతమ్మ పాల్గొన్నారు.

➡️