ఉపాధికి ఆధార్‌ తిప్పలు

Jan 7,2024 21:58

ప్రజాశక్తి – విజయనగరం : ప్రతినిధి జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీల వేతనాల చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ అమలు చేస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచీ ఈ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో.. అంటూ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 3.51 లక్షల మందికి ఉపాధి జాబ్‌ కార్డులు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.61 కోట్ల పనిదినాలు కల్పించినట్టు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఈ లెక్కన పనిదినాలు 107.27 శాతంగా నమోదయ్యాయి. అటు పార్వతీపురం మన్యం జిల్లాలో 2.07 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 3.95 లక్షల మంది పనులు చేస్తున్నారు. రోజువారీగా పనులకు హాజరౌతున్న వారి సంఖ్య 1.91లక్షల వరకు ఉంది. ఇరు జిల్లాల్లోనూ ఏటా వందల కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకు జమ అవుతున్నాయి. దీంతో ప్రకృతి వైపరీత్యాలు, లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనా ఉపాధి కూలి డబ్బులతో బతుకీడుస్తున్నారు. దీన్నిబట్టి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉపాధి హామీ పనుల అవసరం, ఆవశ్యకత ఎంత ఉందో వేరేగా చెప్పనక్కర్లేదు. తాజాగా జాబ్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలన్న నిబంధన తప్పనిసరి చేయడంతో ఎలాంటి చిక్కులు వస్తాయో అన్న ఆందోళన కూలీల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం కూలీలందరికీ బ్యాంకు ఖాతాల ద్వారానే కూలి సొమ్ము అందుతోంది. బ్యాంకర్లు కూడా ఆధార్‌ ఉంటే తప్ప ఖాతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జాబ్‌కార్డుకు కూడా ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ప్రశ్న. త్వరలో ముఖ ఆధారిత హాజరు అమలుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈనేపథ్యంలో ఉపాధిలో కోత విధించేందుకే ఇటువంటి విధానాలు అమలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఉపాధి పనులను ఒక పూటకు బదులు రెండు పూటలు చేయాలని నిబంధన పెట్టడం, వేసవి అలవెన్సులు, పార, గునపాం, గమెలాలు వంటి పనిముట్లకు చెల్లించే డబ్బులు రద్దుచేయడం వంటి విధానాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏడాదికి 200రోజులు పని కల్పించాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈనేపథ్యంలో అసలుకే ఎసరుపెట్టి, ఉపాధి నిధుల్లో మరింత కోత విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే జాబ్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయడం విజయనగరం జిల్లాలో 99శాతం పూర్తిచేసినట్టు అధికారులు చెప్తుండగా, పార్వతీపురం మన్యం జిల్లాలో ఆధార్‌ కార్డు లేని గిరిజనులు చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరికి కూలి సొమ్ము ఎలా చెల్లిస్తారో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి పనులు పెద్దగా జరగడం లేదు. సంక్రాంతి పండగ వెళ్లాక రెండు జిల్లాల్లోనూ పనులు ముమ్మరంగా సాగుతాయి. పేమెంట్లు చెల్లింపుల్లో ఆధార్‌ లింకు అసలు రంగు బయటపడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

➡️