ఉపాధి చూపి వలసలను నివారించాలి

ప్రజాశక్తి-గుంటూరు : ఉపాధి హామీ పనులను తక్షణమే చేపట్టి వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శనివారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జె.బాలరాజు అధ్యక్షతన విస్తృత సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో 400 మండలాల్లో తీవ్రమైన కరువు ఏర్పడిందని, 20-25 లక్షల మంది వ్యవసాయ కార్మికులు వలస పోయారని తెలిపారు. వలసకు వెళ్లిన చోట భద్రత లేక అనేకమంది చనిపోతున్నారని, అక్కడ కూడా పనులు లేక భిక్షాటన చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇంత తీవ్రమైన కరువు పరిస్థితులున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవటం దారుణమని విమ ర్శించారు. కూలీల కోసం వచ్చిన ఉపాధి హామీ నిధులను భవనాలకు, సిమెంట్‌ రోడ్లకు మళ్లించి కూలీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కరువు నివారణకు ఉపాధి నిధులు పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని కోరుతూ డిసెంబర్‌ 4న ఢిల్లీలో జరిగే మహాధర్నాలో వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మాట్లాడుతూ డిసెంబర్‌ 4న ఢిల్లీ మహాధర్నాకు సంఘీభావంగా తాహశీల్దారు కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని కోరారు. జనవరి 5,6 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తత సమావేశం గుంటూరు నగరంలో జరుగుతుందని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై రాష్ట్ర స్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఆత్మకూరు, చిలువూరు తదితర గ్రామాల్లో అనేక గ్రామాల్లో దళితులకు స్మశాన వాటికలకు భూములు కేటాయించాలన్నారు. ఉపాధి హామీ చట్టంలో రెండు పూటలా పని విధానం, మంచినీళ్లు, పార, తట్టకు, గడ్డిపారకు ఇచ్చే డబ్బులు నిలిపేయటం, ఆన్‌లైన్‌ మస్టర్‌ విధానం , వేతనాలు వారాల తరబడి పెండింగ్‌లో ఉంచటం వంటివి చట్టాన్ని నీరుగార్చటమేనని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో కష్ణా పశ్చిమ డెల్టా ప్రాంతంలో వ్యవసాయ రంగంలో వచ్చిన అనేక మార్పులు వల్ల వ్యవసాయ పనులు తగ్గిపోయాయని, దీంతో వ్యవసాయ కూలీలు పనుల్లేక వలసలు పోతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికులకు పనులు లేక ఇబ్బంది పడుతుంటే కూలీలు పనులకు రావట్లేదని పెత్తందారులు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఉపాధి హామీ పనులను కేవలం 25 రోజులు మాత్రమే చేయిస్తున్నారని, చట్టం ప్రకారం కుటుంబానికి వంద రోజులు పని కల్పించాల్సి ఉందని గుర్తు చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.కోటేశ్వరి, నాయకులు నాగేశ్వరరావు, ఎన్‌.దుర్గారావు పాల్గొన్నారు.

➡️