ఉపాధి హామీ పనులు కల్పించాలి

Feb 1,2024 21:32

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : మండలంలోని కొన్ని గ్రామాలకే కాకుండా అన్ని గ్రామాల ఉపాధి కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. మండలంలోని మరిపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాలకు ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించాలని, గ్రామాల్లో కూలీలకు పనుల్లేక వలసలు పోతున్న పరిస్థితి ఉందని తెలిపారు. కూలీలకు ఉపాధి పనులు పెట్టాలని అడుగుతున్న గ్రామాల్లో ఉపాధి పనులు పెట్టడం లేదని తెలిపారు. ఇప్పటికైనా మరిపల్లి, మామిడిపల్లి, బాగువలస, శివరాంపురం, పెదబోరబంద వంటి పెద్ద గ్రామాల్లో పనులు ప్రారంభించి కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కూలి రేట్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి పని దినాలు తగ్గిపోయాయని, పనుల్లేక కూలీలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏడాదికి ప్రతి కుటుంబానికి 200రోజులు పని కల్పించాలని కోరారు. ఉపాధి హామీ నిర్వహణ లోప భూయిష్టంగా ఉందని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉపాధి హామీని చట్టాన్ని అమలు చేయాలని, పనికి అవసరమైన పనిముట్లు పంపిణీ చేయాలని, పనిచేసే చోట కూలీలకు సౌకర్యాలు కల్పించాలని, వెంటనే అన్ని గ్రామాలకు ఉపాధి హామీ పనులు ప్రారంభించి కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిచో కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు రాములమ్మ, వేతనదారులు కసినిబోయిన తిరుపతి, తట్టబోయిన సరస్వతి, తౌడు, నమ్మి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు, వీరి ఆందోళనకు సిపిఎం జిల్లాకమిటీసభ్యులు కోరాడ ఈశ్వరరావు సంఘీభావం తెలిపారు.

➡️