ఉలిక్కిపడ్డ ఉమ్మడి జిల్లా

Dec 26,2023 21:38

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం, డెంకాడ  :  కరోనా పరిస్థితుల నుంచి పూర్తిగా తేరుకొని ఎవరి కార్యకలాపాల్లో వారు నిమగమైన వేళ మళ్లీ కరోనా కలకకలం మొదలైంది. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడిజిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జియమ్మవలస మండలం కుందరతిరువాడ పంచాయితీ నీచకవలసకు చెందిన మహిళకు కోవిడ్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె భర్త ఇటీవలే శబరిమల వెళ్లి వచ్చారు. తమ బంధువులకు ప్రసాదాలు పంచే క్రమంలో బైక్‌ యాక్సిడెంట్‌లో ఆమె గాయపడ్డారు. వైద్యం కోసం విశాఖ వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా కోవిడ్‌ జెఎన్‌1 కొత్త వేరియంట్‌ ఉన్నట్లు అనుమానించి నిర్ధారణ పరీక్షలు చేశారు. కరోనా ఉండడంతో వైద్యం అందిస్తున్నారు. ఆమె భర్తకు కూడా పరీక్షలు చేయగా కరోనా లక్షణాలు లేనట్లు గుర్తించారు. డెంకాడ మండల కేంద్రానికి చెందిన బండారు నారాయణమ్మ (78) కరోనా బారిన పడింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమె విజయనగరంలో ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యుల సూచన మేరకు ఈనెల 12న విశాఖ కెజిహెచ్‌కు వెళ్లింది. పరీక్షలు చేసిన వైద్యులు కరోనాగా నిర్ధారించారని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు తెలిపాపు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుందని తెలిపారు. కరోనా కేసు నేపథ్యంలో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్‌ ప్రచారం టీవీల్లో, పత్రికల్లో రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాస్క్‌ తప్పనిసరికరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందడంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి ప్రజల స్వగ్రామాలకు వస్తుంటారని, ఈ నేపథ్యంలో కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ వినియోగించాలని కోరుతున్నారు.

➡️