ఎంఎల్‌ఎ ఇంటిఎదుట అంగన్‌వాడీల బైఠాయింపు

Dec 27,2023 21:49
ఫొటో : ఎంఎల్‌ఎ రామిరెడ్డి ఇంటి ముందు బైఠాయించిన అంగన్‌వాడీలు

ఫొటో : ఎంఎల్‌ఎ రామిరెడ్డి ఇంటి ముందు బైఠాయించిన అంగన్‌వాడీలు
ఎంఎల్‌ఎ ఇంటిఎదుట అంగన్‌వాడీల బైఠాయింపు
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని చేపట్టిన నిరవధిక సమ్మె నేటికీ 16వ రోజుకు చేరింది. అందులో భాగంగా కావలిలో మూడోరోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించి అనంతరం భారీ ర్యాలీగా ముసునూరు వద్ద ఉన్న ఎంఎల్‌ఎ ఇంటి వద్దకు చేరుకున్న అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లు అనంతరం ఎంఎల్‌ఎ ఇంటి వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంఎల్‌ఎ ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడే మీడియాతో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కె రెహనాబేగం మాట్లాడుతూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్‌ఎలను కలిసి సమస్యలను చెప్పుకోవాలని పిలుపునిచ్చారని, అందులో భాగంగానే ఎంఎల్‌ఎల ఇంటి వద్దకు వచ్చామని, ఆయన ఇంటిలో లేనందున సమస్యలను చెప్పుకోలేకపోయామని తెలియజేశారు. 16రోజులుగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు సెంటర్లను మూసివేసి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం నాలుగు సార్లుగా యూనియన్‌ నాయకులతో చర్చలు జరిపిందని పాతపాటే మళ్లీ పాడారన్నారు. సమస్యలను పరిష్కరించకపోవడం చాలా దారుణమని, అక్కాచెల్లెళ్ల పాలన అని చెప్పిన ముఖ్యమంత్రి అక్కాచెల్లెళ్లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే చెప్పిన మాట గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతం ఇస్తానని హామీనిచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని ఇదేమి న్యాయమని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి అక్కాచెల్లెళ్లు పడే ఇబ్బందులను ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఎంఎల్‌ఎ కూడా ముఖ్యమంత్రి దృష్టికి అంగన్‌వాడీల సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన ఇంకా కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవాధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య, వ్యకాసం నాయకులు తాళ్లూరి మాల్యాద్రి, నాయకులు ఎస్‌కె అమీర్‌ బాషా, సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌ అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు రఘురావమ్మ, సుభాషిని, వజ్రమ్మ, సౌజన్య, రజిత, పెంచలమ్మ, హిమబింధు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

➡️