ఎంపీ స్థానాలకు పెమ్మసాని, లావు

Mar 22,2024 23:32

పెమ్మసాని చంద్రశేఖర్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపి తరుఫున పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, నర్సరావుపేటకు వైసిపికి రాజీనామా చేసిన సిట్టింగ్‌ ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయులును ఖరారు చేశారు. వీరిద్దరు ఇప్పటికే ప్రచారంలో కొనసాగుతున్నారు. తాజాగా బాపట్ల లోక్‌సభ స్థానానికి తెలంగాణ బిజెపి అధికారి ప్రతినిధి టి.కృష్ణప్రసాద్‌కు కేటాయించడం టిడిపి నాయకులను విస్మయానికి గురిచేసింది. కృష్ణప్రసాద్‌ బిజెపి నుంచి వరంగల్‌ టిక్కెట్‌ కోరుకోగా అనూహ్యంగా ఆయనకు బాపట్ల టిక్కెట్టు ఇచ్చారు. దీంతో ఈ సీటు ఆశించిన పలువురు దళిత నేతలు అసంతృప్తికి గురయ్యారు. పార్టీతో సంబంధం లేనివారికి ఇవ్వడంపై పలువురు నేతలు కినుక వహించారు. ఈ నిర్ణయంతో బాపట్ల టిక్కెట్‌ ఆశించిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ ఉండవల్లి శ్రీదేవి తన అసహనాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. గతేడాది మార్చిలో వైసిపి నుంచి సస్పెండ్‌ అయిన తరువాత కొద్ది కాలానికి ఆమె టిడిపిలో చేరారు. ఇటీవల ఆమె తిరువూరు, బాపట్ల స్థానాలను ఆశించినా ప్రయోజనం దక్కలేదు. మరోవైపు అసెంబ్లీ స్థానాలకు పెండింగ్‌లో ఉన్న నర్సరావుపేట నుంచి ప్రస్తుత ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబును ఎంపిక చేశారు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వాలని శ్రీకృష్ణదేవరాయులు ప్రతిపాదన నెక్కలేదు. ఆరేళ్లపాటు పార్టీ కోసం పనిచేసిన అరవిందబాబు కాదని ఇప్పటికీ పార్టీలో చేరని జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన చంద్రబాబు.. అరవిందబాబు వైపు మొగ్గు చూపారు. ఈసారి టిక్కెట్లు దక్కని సీనియర్లను చంద్రబాబు నాయుడు, లోకేష్‌ బుజ్జగిస్తున్నారు. జనసేన పొత్తు వల్ల తెనాలి టిక్కెట్‌ దక్కకపోయినా మరోచోటైనా అవకాశం దక్కుతుందని భావించిన మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటీవల ఆయనకు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు ఇస్తారని ప్రచారమైనా ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. అసంతృప్తితో ఆయన పార్టీని వీడతారని శుక్రవారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో ప్రచారం జరిగింది. రాత్రి 7 గంటలకు తెనాలిలో అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆయన అనుచరులు ప్రకటించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు జోక్యం చేసుకుని ఆలపాటిని ఉండవల్లిలోని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి బుజ్జగించినట్టు తెలిసింది. దీంతో ఆలపాటి మెత్తపడ్డట్టు సమాచారం.

➡️