ఎంసిసి నిబంధనలు తప్పక పాటించాలి

ప్రజాశక్తి-రాయచోటి త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో సాధారణ ఎన్నికల నిర్వహణపై ఎస్‌పి కృష్ణారావుతో కలిసి కలెక్టర్‌ విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ వెలువడుతుందన్నారు. ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ఛాలెంజ్‌గా తీసుకొని విజయవంతం చేసేందుకు కషి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు పర్చాలన్నారు. ఈ ఎన్నికలలో ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన రోజు నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎంసిసి నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు చేయడం, రెచ్చగొట్టేలా రాజకీయనేతలు ప్రవర్తించకూడదన్నారు. మసీదులు, చర్చీలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదన్నారు. పోలింగ్‌ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం వంటివి నిషిద్ధమన్నారు. అనుమతి లేకుండా బ్యానర్లు కట్టడం,లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేయడం, డబ్బులు పంపిణీ చేయడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించకూడదన్నారు. నిబంధనల ప్రకారం వెహికల్‌ పరిమిషన్‌ తీసుకోవాలన్నారు. ఎంసిసి వైలేషన్స్‌ జరిగినట్లు తమ దష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో ఒక కంట్రోల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు భారత ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన నియమ నిబంధనల మేరకే పని చేయాల్సి ఉంటుందన్నారు.ఎన్నికల కమిషన్‌ ఎప్పటికప్పుడు జారీ చేసే నిబంధనలను చక్కగా అవగాహన చేసుకుని నిర్దేశిత సమయంలోనే పనులు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారా, ఓటర్లను ప్రభావితం చేసే పనులు ఎవరైనా చేపడుతున్నారా, తదితరాలను పరిశీలిస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలని, రాజకీయ నేతల విగ్రహాలను కప్పి ఉంచాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ జిపిఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 14,12,266 మంది ఓటర్లు ఉన్నారని ఈసారి 80 శాతం ఓటింగ్‌ జరిగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల విధులలో పాల్గొనే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. జిల్లాల 266 రూట్లు ఏర్పాటు చేసి 18 ప్లేయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. సి విజిల్‌ ప్రతి ఒక్కరు డౌన్లోడ్‌ చేసుకోవాలన్నారు. సి విజరు ద్వారా వచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకొని పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరు విజిల్‌ ద్వారా ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ బూతులకు రాలేని 80 సంవత్సరాలు పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి దగ్గర నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అని చర్యలు చేపట్టడం జరిగిందని ప్రతి ఒక్కరు ఈ ఎన్నికలకు సహకరించి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌, డిఆర్‌ఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️