ఎక్కడికక్కడ అంగన్‌వాడీల అరెస్టులు

ఎక్కడికక్కడ అంగన్‌వాడీల అరెస్టులు

చలో విజయవాడ కార్యక్రమానికి వెళుతున్న పలువురు అంగన్‌వాడీ వర్కర్లను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారిని పోలీసు స్టేషన్లకు తరలించారు. తమ సమస్యలు పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. విజయవాడ బయలుదేరిన అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. కాకినాడ, కరప, సామర్లకోట, తుని తదితర స్టేషన్లో సుమారు 130 మందిని అరెస్టు చేశారు. కాకినాడలో రైల్వే స్టేషన్‌ వద్ద అరెస్ట్‌ చేసి త్రీ టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. వారితో పాటు ఐద్వా నాయకురాలు బి.గంగా భవాని అరెస్టయ్యారు. కనీసం మహిళా కానిస్టేబుల్స్‌ లేకుండానే మగ పోలీసులు వర్కర్లపై దురుసుగా వ్యవహరించడం శోచనీయమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురి సెల్‌ ఫోన్లను లాక్కుని అతిగా ప్రవర్తించారు. మహిళలను చట్ట ప్రకారం సూర్యాస్తమయం తర్వాత స్టేషన్లలో ఉంచకూడదని, ఎలా ఉంచుతారని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించారని చెప్పారు. ఎటువంటి నేరం చేయకపోయినా కొంతమందిని లాకప్‌లో పెట్టి నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. పోలీస్‌ స్టేషన్లోనే అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. న్యాయమైన కోర్కెలను అడుగుతుంటే జగన్‌ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను తక్షణమే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేష బాబ్జి, సిహెచ్‌ రాజకుమార్‌, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.ప్రజాశక్తి-యంత్రాగంకాకినాడలో దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు సీనియర్‌ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలు 41 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చీమకుట్టినట్టు కూడా వ్యవహరించట్లేదని అన్నారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. వేతనాలు పెంచే వరకు అంగన్‌వాడీలు ఉద్యమం విరమించేది లేదని ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం సాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రమణమ్మ, వీరవేణి, ఆండాళ్లు, లక్ష్మి, జ్యోతి, నాగమణి పాల్గొన్నారు.కరప తమశీల్దారు కార్యాలయం అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్దకు ఎస్‌ఐ టి.రామకృష్ణ, పోలీసులు వచ్చి నోటీసులు జారీ చేశారు. సంతకాలు పెట్టేది లేదని పోలీసులకు అంగన్‌వాడీలు చెప్పారు. మండలానికి చెందిన అంగన్‌వాడీలు విజయవాడ వెళ్లేందుకు పోర్టు రైల్వే స్టేషన్‌లో ఉండగా పోలీసులు కాకినాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో వారు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమ్మెలో పి.వీరవేణి, భవాని, వరలక్ష్మి, నారాయణమ్మ తదితరులు ఉన్నారు.సామర్లకోట రూరల్‌ చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్‌వాడీ వర్కర్లను సామర్లకోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా పరిధిలో పలు మండలాలకు చెందిన సుమారు 65 మంది అంగన్‌వాడీ వర్కర్స్‌ను అదుపులోకి తీసుకుని సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత కూడా వారిని విడుదల చేయకుండా నిర్బంధించారని సిఐటియు నాయకులు టి.రాజా తెలిపారు.కోటనందూరు తుని రైల్వే స్టేషన్లో విజయవాడ వెళుతున్న అంగన్వాడీలను అరెస్ట్‌ చేసి తుని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొంతమంది అంగన్వాడీలు కుటుంబ సభ్యులతో మేరీ మాత గుడికి వెళుతుండగా పోలీసులు అరెస్ట్‌ చేయడం దారుణమని అంగన్వాడీ నాయకురాలు వై.ధనలక్ష్మి అన్నారు. దీనిపై పట్టణ పోలీసులను వివరణ కోరగా అంగన్వాడీలు విజయవాడ వెళుతుండగా వారిని అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశామని తెలిపారు. జగ్గంపేట రూరల్‌ అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను అరెస్టు చేసినా ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరింఆచరు. తాళ్లరేవు అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత ధోరణిని ప్రజా సంఘాల నాయకులు వల్లు రాజబాబు, అత్తిలి బాబూరావు, మందనక్క తణుకు రాజు, దుప్పి అదృష్టదీపుడు, ఉంగరాల బూరి బాబు, సుందరపల్లి సత్యనారాయణ ఖండించారు. 41వ రోజు సమ్మెలో భాగంగా తాళ్లరేవు సమ్మె శిబిరం వద్ద అంగన్వాడీలకు వారు మద్దతు తెలియజేశారు. ప్రభుత్వంపై పోరాడుతున్న అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని శిబిరాల వద్దకు పోలీసుల్ని పంపి అరెస్టులు చేస్తామని నోటీసులు అందజేస్తూ బెదిరిస్తున్నారన్నారు. ఇటువంటి చిరుద్యోగ మహిళలపై ఇంత దారుణంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. గండేపల్లి అంగన్వాడీలు విజయవాడ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసి బస్సులు, ఆటోల్లో ఉన్న వారిని గుర్తించి పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిర్బంధించారు. హక్కుల కోసం పోరాడే తమను ఉక్కు పాదం మోపి నిర్బంధించడం సరైన పద్ధతి కాదని దీనిపై మేము ఎంతటికైనా తెగించి పోరాడుతామని అంగన్‌వాడీల మండల అధ్యక్షురాలు రాజేశ్వరి తెలిపారు.

➡️