ఎనిమిదో రోజుకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ యుటిఎఫ్‌ మద్దతుగా ఉంటుందని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ ముస్తఫా ఆలీ, ఆర్‌.రవికుమార్‌ అన్నారు. ఉద్యోగుల సమ్మెలో భాగంగా బుధవారం ఎనిమిదో రోజు ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముస్తఫా ఆలీ, రవికుమార్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. ఎనిమిది రోజులుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేదని, ఉద్యోగుల కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ప్రభుత్వాలున్నాయని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ నియంతృత్వ పోకడకు బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఉద్యోగులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉద్యోగుల సమస్యలు ఎజెండగా ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీకే మద్దతివ్వాలని తెలిపారు. ఓట్‌ ఫర్‌ రెగ్యులర్‌ నినాదంతో సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టీచర్లు సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల పనులు చేయకుండా తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఎం.రాజు, కె.కమలాకర్‌, వి.కేశవరావు, వెంకటలక్ష్మి, సుగుణ, కుమారి, రజిని పాల్గొన్నారు.

➡️