ఎన్నికల’ఆట’..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఎన్నికల ఆట మొదలైంది. రెండు జిల్లాల్లోనూ అధికార పార్టీ ఎంఎల్‌ఎల్లో టిక్కెట్‌ టెన్షన్‌ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఉంటుందో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఐదు నియోజకవర్గాల్లో మార్పులు తప్పవని వైసిపి అధిష్టానం చెప్పకనే చెప్పింది. దీంతో టిక్కెట్‌ కోసం సిఎం వద్దకు ఎంఎల్‌ఎలు క్యూ కడుతున్నారు. తమకున్న పలుకుబడిని ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలకుగాను 13 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను వైసిపి గెలుచుకుంది. జిల్లాల విభజన తర్వాత ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు, పశ్చిగోదావరి జిల్లాలో ఏడు స్థానాలు, మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీస్థానాలు ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలను మార్చి కొత్తవారిని బరిలోకి దింపాలని వైసిపి ప్రణాళికలు రచించింది. అందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి టిక్కెట్ల మార్పులపై వైసిపి అధిష్టానం స్పష్టంగా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజుకు ఇప్పటికే టిక్కెట్‌ లేదని స్పష్టంగా తెలియచేసినట్లు తెలిసింది. అంతేకాకుండా సమర్దుడైన వ్యక్తి పేరును సూచించాలని బాలరాజునే కోరినట్లు సమాచారం. దీంతో తన భార్యకు టిక్కెట్‌ ఇవ్వాలని బాలరాజు అడిగినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో పోలవరం సిట్టింగ్‌ ఎంఎల్‌ఎకు టిక్కెట్‌ లేదని స్పష్టంగా అధిష్టానం తేల్చిసినట్లే. ఇక చింతలపూడి ఎంఎల్‌ఎ ఎలిజాకు ఎంఎల్‌ఎ టిక్కెట్‌ లేదని చెప్పినట్లు సమాచారం. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని మొదట పేర్కొన్నట్లు ప్రచారం సాగింది. అమలాపురం ఎంపీ టిక్కెట్‌ పినిపే విశ్వరూప్‌కు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఎలిజా పరిస్థితి ఏమిటో తెలియకుండాపోయింది. చింతలపూడి నుంచి శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజును బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో రవాణాశాఖలో పని చేస్తున్న అధికారికి అవకాశం దక్కనున్నట్లు చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో తేలిపోనుంది. ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబుకు టిక్కెట్‌ లేదని అధిష్టానం స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇక్కడ నుంచి బిసి అభ్యర్ధిని పోటీకి దింపాలని ఆలోచన చేస్త్నుట్లు సమాచారం. అభ్యర్ధి నిర్ణయంపై మాత్రం ఇంకా అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. కైకలూరు టిక్కెట్‌ మార్పుపై ప్రచారం సాగినా మార్పు ఉండదని చెబుతున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాల్లో మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజుకు టిక్కెట్‌ లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆయన్ని ఏవిధంగా పార్టీ ఉపయోగించుకుంటుందో ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న గుడాల గోపీకి కాకుండా వేరొకరికి టిక్కెట్‌ ఇవ్వాలని వైసిపి అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది. నరసాపురం ఎంఎల్‌ఎ ప్రసాద్‌రాజును మారుస్తారని ప్రచారం సాగినప్పటికీ స్పష్టమైన సంకేతాలు ఇంకా వెలువడలేదు. రెండు జిల్లాల్లో ఐదుస్థానాల్లో మార్పులు జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై వైసిపి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని నేతలు చెబుతున్నారు. ఎంపీ స్థానాల్లో బరిలోకి దింపే అభ్యర్థులకు సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్‌ మరోసారి బరిలోకి దిగేందుకు సుముఖంగా లేనట్లు ప్రచారం సాగుతోంది. అదే సమయంలో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు ఇప్పటికే పార్టీ వ్యతిరేకిగా ఉండటంతో అక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.టిడిపిలోనూ టిక్కెట్లపై వీడని ఉత్కంఠ ప్రతిపక్ష పార్టీ టిడిపిలోనూ ఎంఎల్‌ఎ టిక్కెట్ల కేటాయింపులపై ఉత్కంఠ కొనసాగుతోంది. టిడిపి, జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపు ఏవిధంగా ఉంటుందోననే టెన్షన్‌ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జుల్లో నెలకొంది. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారోననే చర్చ కొనసాగుతోంది. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఉంగుటూరు మాజీ ఎంఎల్‌ఎ గన్ని వీరాంజనేయులుకు ఎక్కడ టిక్కెట్‌ కేటాయిస్తారో తేల్చాల్సి ఉంటుంది. ఇంకా ఎస్‌సి నియోజకవర్గం చింతలపూడి, ఎస్‌టి నియోజకవర్గం పోలవరం స్థానాలు ఎవరికి కేటాయిస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ స్థానాలకు ఆశావహులు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్టీల నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ఆశావహుల్లో తీవ్ర టెన్షన్‌ నెలకొంది.

➡️