ఎన్నికలకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలి

Mar 2,2024 21:37
ఫొటో : అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

ఫొటో : అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌
ఎన్నికలకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈవిఎంలను భద్రపరచడం, ఈవిఎంల ర్యాండమైజేషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల కోసం బీసీ బాలికల వసతి గృహంలోని గదులను కలెక్టర్‌ పరిశీలించారు. తొలుత తహశీల్దార్‌ కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఈవిఎంల భద్రత, స్ట్రాంగ్‌ రూముల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ, నామినేషన్ల స్వీకరణకు ఆర్‌ఒ కార్యాలయం ఏర్పాటు, సిబ్బంది వసతి సౌకర్యాలు మొదలైన ఏర్పాట్లను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దుత్తలూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు మొదలైన అన్ని మౌలిక వసతులను సమకూర్చాలన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటిస్తూ పోలింగ్‌ కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారి రాజా రమేష్‌ ప్రేమ్‌ కుమార్‌, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి, దుత్తలూరు తహశీల్దార్లు నెహ్రూ బాబు, కృష్ణారెడ్డి, కిషోర్‌ బాబు, యశోద, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️