ఎన్నికల్లో తడాఖా చూపిస్తాం

Dec 22,2023 21:32

  ప్రజాశక్తి-విజయనగరంకోట  :  రానున్న పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీలు అంటే ఏమిటో తడాఖా చూపిస్తామని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి దుర్భరంగా ఆవేదన వ్యక్తం చేశారు, గుక్కెడు నీళ్లు తాగడానికి నిధులు లేవని,పంచాయతీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యం అయిందని, దీనికి కారణం ముఖ్యమంత్రేనని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన 14, 15 సంవత్సర ఆర్థిక సంఘం నిధులను సొంత అవసరాలకు వాడుకున్నారని తెలిపారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8629 కోట్ల రూపాయలను జగన్‌ దిగమింగారన్నారు. రాష్ట్రంలో 12918 మంది సర్పంచుల్లో 90 శాతం సర్పంచులు వైసిపి నాయకులు ఉన్నారన్నారు, పాము తన పిల్లలను తానే తింటున్న మాదిరిగా ముఖ్యమంత్రి తమ సర్పంచ్‌ల నిధులను మింగుతున్నారని తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి గ్రామాల్లో సభలు పెట్టి ఎందుకు ప్రజలకు సేవ చేయలేక పోతున్నామో వివరిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగంలో ఉన్న 73 ,74 రాజ్యాంగ చట్టాలకు జగన్మోహన్‌ రెడ్డి తూట్లు పొడుస్తున్నారన్నారు. సచివాలయాలను గ్రామపంచాయతీల్లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ద్వారా ఎన్నికైన తాము ప్రజలు ప్రశ్నిస్తుంటే పిల్లల్లా దాక్కోవలసి వస్తుందని అన్నారు. విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కె.సత్యం, రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ కార్యదర్శి గేదెల రాజారావు, ఉపాధ్యక్షులు రామకృష్ణబాబు, వినోద్‌ రాజు, ఎస్‌.కోట నియోజకవర్గం పంచాయతీ రాజ్‌ అధ్యక్షులు డేగల ఈశ్వరరావు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️