ఎన్నికల్లో ప్రత్యేకహోదా, విభజన హామీలు ఎజెండాగా ఉండాలి : వైసిపి, టిడిపి, జనసేన విధానం వెల్లడించాలి  : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు 

 మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో జెఎసి నాయకులను పరామర్శిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – మంగళగిరి 

ప్రత్యేక హోదా, విభజన హమీల చట్టం అమలపై వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు వారి విధానం ఏమిటో ప్రజలకు తెలియ జేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని శుక్రవారం ప్రత్యేకహోదా విభజన హామీల సాధన విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సీఎం నివాసం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా సిఎం క్యాంపు కార్యాలయానికి వెళుతున్న ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావును, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ, మరో 12 మందిని తాడేపల్లిలో అరెస్ట్‌ చేసి, మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న నాయకులను, తాడేపల్లిలో గృహ నిర్భందంలో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పరామర్శించారు. మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో వి శ్రీనివాసరావు మాట్లాడుతు రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వారి ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి బిజెపికి వంతపాడుతున్నాయన్నారు. వైసిపికి 31మంది ఎంపిలు ఉన్నప్పటికీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో లేదని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న మూడు పార్టీలు ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో రాజీ పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకు వెళ్లాలని కోరిన నాయకులను అక్రమంగా అరెస్ట్‌ చేయడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఏజెండాగా ఈ అంశాలను పొందుపరచాలని కోరారు. ఇప్పటికీ కలిసి రాకపోతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయకుండా మోసం చేసిన బిజెపి అధికార వైసిపి, ప్రతిపక్ష జనసేన టిడిపి ప్రశ్నించకపోవడం దేనికి సంకేతమన్నారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తున్న బిజెపి విధానంపై మూడు పార్టీలు నామమాత్రంగానే పోరాటం చేస్తున్నాయని విమర్శించారు. రైల్వే జోన్‌ గురించి కూడా మాట్లాడటం లేదన్నారు.జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రామరాజ్యం అంటే ఇచ్చిన మాట తప్పటమా అని ప్రశ్నించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఢిల్లీలో రైతులు జరుపుతున్న పోరాటంలాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై రానున్న ఎన్నికల్లో రైల్వే జోన్‌, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవడానికి ప్రజలు సన్నద్ధం కావాలని కోరారు. పోలీస్‌ స్టేషన్లో ఉన్న నాయకులను సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చేంగయ్యా, సిపిఎం సీనియర్‌ నాయకులు జె వి రాఘవులు, సిపిఎం పట్టణ నాయకులు ఎం బాలాజీ, సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్‌ బాబు పరామర్శించారు. పోలీసుల అరెస్టులను ఖండించారు.

➡️