ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి

Feb 7,2024 21:57

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించిన, ఎన్నికల విధులు కొత్తగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షన్మోహన్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ బి.పుల్లయ్య, డ్వామా పిడి ఎన్‌.రాజశేఖర్‌లతో కలసి 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈ ఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, నోడల్‌ ఆఫీసర్లు, ఎంపిడిఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, నంద్యాల జిల్లా నుండి వచ్చిన ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్నికల విధులు కొత్తగా ఉంటుందని, ఎన్నికల విధులలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా భాద్యతగా ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. 18, 19, 20, 21 సంవత్సరాల యువత కొత్తగా ఫారం 6 ద్వారా ఓటర్‌ నమోదుకు ఇచ్చినప్పుడు ఫారం 6తో పాటుగా ఆధార్‌ కార్డు, స్కూల్‌ సర్టిఫికెట్‌, బర్త్‌ సర్టిఫికేట్‌ను తీసుకోవాలన్నారు. ఫారం 7 తీసివేయడం, మైగ్రేషన్‌ తీసుకోరాదని, మరణించి వాటికి సంబంధించిన వాటిని మాత్రమే తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉన్న డెత్‌ సర్టిఫికేట్ల పరిశీలించాలన్నారు. న్యూస్‌ పేపర్లలో వచ్చిన వాటికి సంబంధించి పూర్తి వివరాలను సంబంధిత ఏఈఆర్వోల నుండి తెప్పించుకోవాలని, రాజకీయపార్టీ నాయకులు అందజేసే ఫిర్యాదులను ఎలక్షన్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తీసుకొని పరిశీలించాలన్నారు. ప్రతివారం ఏఈఆర్‌ఓలు ఆ వారంలో 6,7,8 ఫారములకు సంబంధించి రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి వారికి తెలియజేయాలన్నారు. ఈఆర్‌ఓలు అందరు వారికి సంబంధించిన నియోజకవర్గం పరిధిలో రూట్లు ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. ఏఈఆర్‌ఓలు ప్రతి మండల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలు వాటికి సంబందించిన రూట్లులో పోలింగ్‌ కేంద్రాలలో గల సౌకర్యాలను పరిశీలించి రిపోర్టును అందజేయాలని ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. జిల్లాలోని ఎంఈఓల అందరితో సమావేశం నిర్వహించి వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలలో ఏమైనా పనులు పెండింగ్‌లో ఉంటే దానికి సంబంధించి నిధులు మంజూరు చేసి ఫిబ్రవరి 21కల్లా పనులు పూర్తి చేసి రిపోర్టును పంపించాలని ఎంపిడిఓలను ఆదేశించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని ఇంకా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలని, పోలింగ్‌ కేంద్రాలలో నెట్వర్క్‌ సమస్యలుంటే వాటిని పరిశీలించాలని అక్కడ ఏ నెట్వర్క్‌ పనిచేస్తుందో వంటి వివరాలను అందజేయాలన్నారు. ఈఆర్‌ఓలు అందరూ వారి పరిధిలో ఉన్న స్ట్రాంగ్‌ రూములను పరిశీలించాలని, ఏమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన వివరాలను పంపించాలన్నారు. ఏఈఆర్‌వోలు ఆర్వోలు ప్రతి ఒక్కరు ఎన్నికలకు సంబంధించి హ్యాండ్‌ బుక్‌ను పూర్తిగా చదువుకొని అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాలో ప్రతి మండలంలో కోఆర్డినేషన్‌ టీం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కోఆర్డినేషన్‌ టీం సమర్థవంతంగా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. ప్రతి మండలంలో ఒక ఆదర్శ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఆర్‌ఓలు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్వోలు, నోడల్‌ ఆఫీసర్స్‌, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

➡️