ఎర్ర చీరలు, నల్ల రిబ్బన్లతో అంగన్వాడీల నిరసన

Dec 15,2023 20:05

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) చేపట్టిన సమ్మె గురువారానికి నాలుగోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఎర్ర చీరలు కట్టి కళ్ళకు గంతలు కట్టుకొని అంగన్వాడీలంతా పాల్గొన్నారు. వీరి పోరాటానికి టిడిపి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూసపాటి అతిథి గజపతి, జనసేన నాయకులు మంత్రి పడాల అరుణ, యశ్వస్విని, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు, ఆమ్‌ ఆద్మీ జిల్లా కన్వీనర్‌ దయానంద్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి ఐదేళ్ల కావస్తున్నా ఇంత వరకు ఎందుకు వేతనాలు పెంచలేదన్నారు. వెంటనే వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పార్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్‌ మాట్లాడుతూ అంగన్వాడీ లు సమస్యలు పరిష్కారం చేసి, సమ్మెను విరమింప చేయాల్సిన ప్రభుత్వం మరింత రెచ్చగొట్టే విధంగా చర్యలు ఉన్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తెరిపించడం, తాళాలు బద్దలు కొట్టించడం వంటి చర్యలు ప్రభుత్వం చేయాల్సిన పనులు కాదని, రౌడీలు చేయాల్సిన పనులు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కవ్వింపు చర్యలు,బెదిరింపులు మానుకోవాలని లేదంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.గజపతినగరంలో ర్యాలీ సమ్మె సందర్భంగా అంగన్వాడీలు కళ్లకు నల్లని రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం మెయిన్‌ రోడ్‌ నుంచి ఎంపిడిఒ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు ఎంపిడిఒకు వినతినిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తే తాళాలు బద్దలుగొట్టే సంస్కృతికి ఈ ప్రభుత్వం తెరతీసిందని, ఇది సరైన పద్దతి కాదని అన్నారు. కేంద్రాల్లో సామాన్లు పోయిన బాధ్యత బద్దలు కొట్టే వాళ్ళదని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు ఎం.సుభాషిని, ప్రాజెక్టు కార్యదర్శి పి.జ్యోతి, సెక్టార్‌ నాయకులు రాములమ్మ నాగమణి, సన్యాసమ్మ, అనురాధ, వై.పద్మావతి, నారాయణమ్మ నరసమ్మ,దమయంతి తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు మాజీమంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పడాల అరుణ మద్దతు, యుటిఎఫ్‌ నాయకులు భాస్కరరావు, శంకర్రావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.రాము, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌. రాములు తదితరులు మద్దతు తెలిపారు.

➡️