ఎలా బతకాలో అర్థం కావడం లేదు

Mar 10,2024 23:37

దీక్షా శిబిరాన్ని ప్రారంభిస్తున్న వేములపల్లి వెంకటరామయ్య
ప్రజాశక్తి – దుగ్గిరాల :
శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం సంభవించి పంట దగ్ధమైన తమకు పరిహారం ఇవ్వాలని బాధితుల చేపట్టిన నిరాహార దీక్షలు పదో రోజుకు చేరాయి. ఆదివారం శిబిరాన్ని బాధిత పసుపు రైతుల కమిటీ కన్వీనర్‌ వి.వెంకటరామయ్య, రైతు లంకిరెడ్డి నాగేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రైతు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ తన వయస్సు 72 ఏళ్లని, ఇకమీదట వ్యవసాయం చేయటానికి ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేదని చెప్పారు. అగ్ని ప్రమాదంలో పంటను నష్టపోయిన తమకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే ఎలా బతకాలో అర్థం కాక మానసికంగా వేదనకు గురవుతున్నామని వాపోయారు. ఆరేడేళ్లుగా పండిన పంటను పండినట్లు కోల్డ్‌ స్టోరేజీలో పెట్టామని, 700 బస్తాల పంట మంటల్లో బూడిదైందని ఆవేదనకు గురయ్యారు. పొన్నూరు మండలం మాచవరానికి చెందిన రైతు వెలగా ప్రశాంత్‌ మాట్లాడుతూ వ్యవసాయం మీద ఆసక్తితో ఏడెకరాల్లో పసుపు సాగు చేయగా 173 బస్తాల దిగుబడి వచ్చింది. సరైన ధర లేకపోవడంతో ధర వచ్చాక అమ్ముకుందామనే ఉద్దేశంతో పంట మొత్తాన్ని కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేశామని, తీరా అగ్ని ప్రమాదంలో బుగ్గి అయ్యిందని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీక్షల్లో పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జొన్న శివశంకర్‌, బాధిత రైతు కమిటీ కో-కన్వీనర్‌ ఎం.శివసాంబిరెడ్డి, నాయకులు జె.బాలరాజు, వై.బ్రహ్మేశ్వరరావు, సిహెచ్‌ పోతురాజు, ఎ.శ్రీనివాసరావు, ఎన్‌.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️