ఎస్మాను రద్దు చేసి డిమాండ్లు నెరవేర్చాలి

ఎస్మాను రద్దు చేసి డిమాండ్లు నెరవేర్చాలి

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 31 రోజుల నుంచి పోరాడుతున్న అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఎస్మాను తక్షణమే ఉపసంహరించి సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష పార్టీల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. సుందరయ్య భవన్‌లో సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష పార్టీల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అంగన్వాడీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎం.రాజశేఖర్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు దువ్వా శేషబాబ్జి, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సిపిఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జె.వెంకటేశ్వర్లు, సిపిఐ (ఎంఎల్‌) జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ, ఆర్‌పిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తాళ్లూరు రాజు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు ప్రభాకర్‌ మాట్లాడారు. తెలంగాణ కంటే రూ.వెయ్యి అదనంగా చెల్లిస్తానని అంగన్వాడీలకు జగన్‌ ఇచ్చిన మాటను అమలు చేయాలని కోరుతూ గత 30 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల నిర్బంధాన్ని ప్రయోగించేందుకు ఎస్మా చట్టాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. తక్షణం అంగన్వాడీలపై విధించిన ఎస్మాని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో అయిదుసార్లు చర్చలు జరిపిన ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం మానేసి ఎస్మా విధించడాన్ని తప్పు పట్టారు. గతంలో ఎస్మాను ఉద్యోగులపై ప్రయోగించిన ప్రభుత్వాలన్ని అధికారాన్ని కోల్పోయారన్నారు. 2019 నుంచి 2024 లోపు మన రాష్ట్రంలో నిత్యవసరాలు ధరలు 300 శాతం పెరిగాయని, అలాంటప్పుడు అంగన్వాడీల జీతాలు పెంచమని అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు. మహిళా సాధికారత గురించి ప్రగల్బాలు పలికే జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీల పట్ల హదయంలేని మనిషిగా వ్యవహరిస్తున్నారన్నారు. నూతనంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగన్వాడీలకు రూ.18000 వేతనం చెల్లిస్తుంటే, మన రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి రూ.11500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కె.ఎస్‌.శ్రీనివాస్‌, సిహెచ్‌.అజరు కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం అఖిలపక్ష పార్టీల నాయకులంతా అంగన్వాడీల నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి వారి పోరాటానికి మద్దతు ప్రకటించి ప్రసంగించారు.

➡️