ఎస్‌.కోట టు సాలూరు

ప్రజాశక్తి – సాలూరు : జిసిసి మాజీ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటు హక్కు నమోదు చేయించుకున్నారు. ఇంతవరకు ఆమె ఓటు హక్కు ఎస్‌.కోట నియోజకవర్గంలో ఉండేది. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు గడువు ముగియనున్న నేపథ్యంలో స్వాతిరాణి, ఆమె భర్త గుల్లిపిల్లి గణేష్‌ ఓట్లను సాలూరు పట్టణానికి బదిలీ చేయించుకున్నారు. పట్టణంలోని శివాలయం వీధిలో ఆమెకు సొంత ఇల్లు ఉంది. గుల్లిపిల్లి గణేష్‌ సొంత ఊరు సాలూరు కావడంతో ఓట్లను బదిలీ చేయించుకున్నారు. రానున్న ఎన్నికల్లో అరుకు ఎంపీగా పోటీ చేయాలనే యోచనలో డాక్టర్‌ స్వాతీరాణి వున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటిదాకా జిసిసి చైర్‌పర్సన్‌గా ఆమె కొనసాగారు. గతంలో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పని చేశారు. పార్టీ అగ్రనేతల ఆశీస్సులతో అరుకు ఎంపీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఆమె తన ఓటును అరుకు ఎంపీ నియోజకవర్గంలో ఉన్న సాలూరు పట్టణానికి బదిలీ చేయించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రల్లో కూడా స్వాతీరాణి, ఆమె తల్లి శోభా హైమావతి చురుగ్గా పాల్గొన్నారు. స్వాతీరాణి భర్త గుల్లిపిల్లి గణేష్‌ పుట్టిన ఊరు సాలూరు కావడంతో ఆయనకు పట్టణంలోని చాలామంది నాయకులతో సత్సంబంధాలు వున్నాయి. సామాజిక కోణంలో కూడా బంధువర్గం ఇక్కడ వుంది. ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌గా పనిచేసిన నేపథ్యంలో కూడా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో విస్తత పరిచయాలు వున్నాయి. అంతేకాకుండా అరుకు ఎంపీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సామాజిక వర్గానికి చెందిన నాయకుడు గణేష్‌ కావడం కూడా వారికి అనుకూల అంశంగా చెప్పవచ్చు. అటు ఎస్టీ, ఇటు బిసి సామాజిక వర్గాల నాయకులతో సంబంధాలు కలిగి వుండడంతో ఆమె అరుకు ఎంపీ సీటు ఆశిస్తున్నారు.అయితే ప్రస్తుతం డిప్యూటీ సిఎంగా రాజన్నదొర కూడా అరుకు ఎంపి సీటు కావాలని కోరుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజన్నదొర మంత్రి, డిప్యూటీ సీఎం వంటి కీలక పదవులు అలంకరించారు. గతంలో జిసిసి అధికారిగా అరుకు, పాడేరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో పని చేసిన రాజన్నదొరకు కూడా గిరిజన సంఘాలతో సత్సంబంధాలు వున్నాయి. సీనియర్‌ గిరిజన ఎమ్మెల్యేగా అరుకు ఎంపి నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో సంబంధాలు వున్నాయి. దీంతో ఆయన కూడా ఎంపి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రాజన్నదొర, స్వాతీరాణి ఇద్దరూ అరుకు ఎంపి సీటు కావాలని కోరుతున్నారు. ఇద్దరిలో ఒకరికి ఎంపీ సీటు, మరొకరికి అసెంబ్లీ సీటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఎవరిని ఎటు పంపించాలనే దాన్ని వైసిపి అధిస్థానం నిర్ణయిస్తుంది. పార్టీ అంతర్గత సర్వేలు, సామాజిక సమీకరణలను దష్టి లో పెట్టుకొని అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏది దక్కినా ఫర్వాలేదని , హైకమాండ్‌ నిర్ణయమే శిరోధార్యమనే రీతిలో ఇద్దరు నేతలు వున్నారు. ఎన్నికల ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో ఒకటి రెండు నెలల్లో ఎవరెటు దానిపై ఉత్కంఠకు తెరపడనుంది.

➡️