చేనేతకు రూ.200 కోట్లు కేటాయించాలి – ఎపి చేనేత కార్మిక సంఘం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర ప్రభుత్వం జులైలో శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో చేనేత పరిశ్రమను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. విజయవాడలో బందరు రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టా శివదుర్గారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. చేనేతపై జిఎస్‌టిని రద్దు చేయాలని, మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికీ నేతన్న నేస్తం పథకం ఇవ్వాలని, బోగస్‌ చేనేత సహకార సంఘాలను రద్దు చేయాలని వారు కోరారు. చేనేత కార్మికులకు మూడు సెంట్లు స్థలంలో మగ్గం షర్టుతో కూడిన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, పట్టు జరీ నూలు ధరలను 2021 నాటి ధరలకు తగ్గించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వృత్తిదారుల రాష్ట్ర కన్వీనరు మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ.. 30 శాతం రిబేటు సంవత్సరం మొత్తం కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికులకు వెల్ఫేర్‌ ఫండ్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామర్తి రాజు, సహాయ కార్యదర్శులు డోకిపర్తి రామారావు, వాసా గంగాధరరావు, మురుగుడు సత్యనారాయణ, భరణి కాలప్ప, కనికె లక్ష్మన్న, గోరురాజు దీపాల సత్యనారాయణ, కటికట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️