ఏపీ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు అవసరం

Feb 19,2024 00:22

సమావేశంలో మాట్లాడుతున్న రాఘవేంద్రరావు
ప్రజాశక్తి-తెనాలి :
కో-ఆపరేటివ్‌ సొసైటీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏపి కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు అనివార్యమని విశాఖపట్టణం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ భవనంలో నూతనంగా నిర్మించిన రెండో అంతస్తును ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సొసైటీ చైర్మన్‌ దావూలూరి లక్ష్మీకాంతారావు అధ్యక్షతన సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటుపై జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవేంద్రరావు మాట్లాడుతూ జాతీయ బ్యాంకులకు దీటుగా క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలు అన్ని రకాల రుణాలు అందిస్తున్నాయన్నారు. అయితే రుణాల రికవరీలో అనేక సమస్యలు ఎదురౌతున్నాయని, వాటి పరిష్కారం నిమిత్తం కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌గా ఏర్పడి, సమిష్టిగా ఆయా సమస్యలు అధిగమించవచ్చని చెప్పారు. డిఎల్‌ కాంతారావు మాట్లాడుతూ మొండి బకాయిల వసూలుకు కో-ఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. అయితే అర్బన్‌ బ్యాంకులకు సేల్‌ ఆఫీసర్‌ ద్వారా రుణాల రికవరీ అవకాశం ఉందని, అదే పంథాలో కో-ఆపరేటివ్‌ సొసైటీలు కూడా రుణాల రికవరీ పొందాలంటే ఫెడరేషన్‌గా ఏర్పడి సొసైటీలకు కూడా సేల్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరవచ్చని వివరించారు. కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు విధి విధానాపై చర్చించారు. సమావేశంలో జిడిసిసి బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ మారౌతు సీతారామయ్య, విశ్రాంత కో-ఆపరేటివ్‌ ఆఫీసర్‌ కె.కృష్ణారెడ్డి, పీపుల్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ ఎ.పుల్లారావు, సిండికేట్‌ బ్యాంక్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సొసైటీ చైర్మన్‌ ఎన్‌.ప్రభాకర్‌, అనంతపూర్‌ సొసైటీ చైర్మన్‌ డి.జయచంద్రారెడ్డి, అమలాపురం కో-ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ కె.రామకృష్ణారెడ్డి, సహకార భూమి జనరల్‌ సెక్రటరీ కె.వెంకటకృష్ణారెడ్డి, కాకతీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ డైరెక్టర్లు వేదాంతం సుబ్రహ్మణ్యశాస్త్రి, షేక్‌ ఖలీల్‌, సిఇఒ కనమర్తపూడి ఝాన్సీలక్ష్మి, పిఆర్వో చెరుకూరి సతీష్‌ పాల్గొన్నారు.

➡️