ఏళ్లు గడుస్తున్నా పనులు జరగవే..!

Mar 5,2024 21:23

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని ఆతవ గ్రామానికి 2011లో రూ. 97.75 లక్షలతో రోడ్డు వేశారు. ప్రస్తుతం ఆ రోడ్డు పూర్తిగా శిథిలావస్తుకు చేరింది. గత వర్షాల కారణంగా రోడ్డు మలుపు వద్ద భయంకరమైన గండి కూడా పడింది. గ్రామం నుండి మండల కేంద్రానికి అత్యవసర సమయాల్లోనూ, విద్యార్థుల విద్యాసంస్థలకు వెళ్లాలంటే ఈ రోడ్డుగుండానే ప్రయాణించి ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో తమకు రోడ్డు కావాలని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరడంతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్‌ రెండేళ్ల క్రితం రోడ్డుని పూర్తిగా తవ్వేసి మెటల్‌ వేసి వదిలేశారు. దీంతో ప్రయాణికులు మళ్లీ అవస్థలు పడుతున్నారు. దీంతో ఇటీవల జరిగిన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో తమ గ్రామానికి వేసిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేమయాలని ఆతవ గ్రామస్తులు కోరగా ఇప్పుడు రోడ్డు లేకపోతే నష్టం ఏంటని, సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా అని బదులివ్వడంతో గ్రామస్తులు ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలిస్తోంది. ఇటువంటి వారికి రానున్న ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని గ్రామస్తులు, యువత చర్చించుకుంటున్నట్లు సమాచారం.

➡️